‘స్థానిక’ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం | Minister Ponnam Prabhakar Over BC Reservation | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం

Sep 28 2025 4:08 AM | Updated on Sep 28 2025 4:08 AM

Minister Ponnam Prabhakar Over BC Reservation

పద్మశాలీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకల్లో మంత్రులు పొన్నం, తుమ్మల  

గన్‌ఫౌండ్రి (హైదరా­బాద్‌): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల­కు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి జీవో 9ని వి­డుదల చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ­ర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఆచా­ర్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ప్రభాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం­లో పురుడు పోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, ఆయన జీవితం.. తెలంగాణ ఉద్యమం పరస్పరం పెనవేసుకున్నాయని కొని­యాడారు.

రిజర్వేషన్లను కాపాడుకోవాలని, అందుకోసం బీసీ సంఘాలు ఐక్యంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. పద్మ­శాలీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే పద్మశాలీలతో సమావేశం ఏర్పా­టు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అణ­గారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని కీర్తించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామని, బతుకమ్మ చీరల తయారీతో కార్మికులు నిలదొక్కుకునేలా, చేనేత రంగానికి అండగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, మేయర్‌ విజయలక్ష్మి, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్, కార్పొరేషన్‌ చైర్మన్లు ఈ అనిల్, మెట్టు సాయికుమార్, అఖిల భారత పద్మశాలి సంఘం నేతలు కామర్థపు మురళి, అవ్వారి భాస్కర్, జగన్నాథం, ప్రవళిక, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement