భూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాం
ఇందులో భాగంగానే భూభారతి పోర్టల్ తెచ్చాం: పొంగులేటి
ఆమనగల్లు: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే సమీకృత భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామంలో గురువారం సమీకృత భూభారతి పోర్టల్‌ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్‌కుమార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ నేతలు అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులను దోచుకున్నారని, వారు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వారి భూ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఐదు మండలాలలో సమీకృత భూభారతి పోర్టల్‌ను గురువారం నుంచి అమలు చేస్తున్నామని, 45 రోజుల పాటు పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులతో జిల్లాకు ఒక మండలంలో పోర్టల్‌ను అమలు చేస్తామని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఏ పేదోడు ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఏ అధికారి దగ్గరకు వెళ్లి ప్రాధేయపడాల్సిన అవసరం ఉండకూడదని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌తో పోర్టల్‌లో లాగిన్ అయితే అన్ని సేవలు పొందొచ్చని వివరించారు.
రాష్ట్రంలో ఉన్న సాదా బైనామాలకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. రాష్ట్రంలో సర్వేయర్ల కొరత లేకుండా 5,300 మందికి రెండు విడతల్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి మండలానికి 4 నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించామని తెలిపారు. భూముల సర్వే విషయంలో పాత పద్ధతులకు స్వస్తి పలికి రోవర్లతో కచ్చితమైన సర్వే చేయిస్తున్నామని, ఇప్పటికే 411 రోవర్లు ఉన్నాయని మరో 400 రోవర్లు రాబోతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత, డీఏఓ ఉషారాణి, డీఈఓ సుశీందర్‌రావు, డీఎంహెచ్‌ఓ డా.లలితాదేవి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ ఫయీం ఖాద్రి, మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్, టీపీసీసీ నేతలు బాలాజీసింగ్, అయిల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.


