కట్టుకోబోయేవాడే చంపాడు.. | Maripeda Azmeera Arvind And Sangeetha Story Details | Sakshi
Sakshi News home page

కట్టుకోబోయేవాడే చంపాడు..

Apr 26 2026 12:13 PM | Updated on Apr 26 2026 12:12 PM

Maripeda Azmeera Arvind And Sangeetha Story Details

సాక్షి, మరిపెడ: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. వివాహ ముహూర్తానికి వారం రోజులే సమయం.. ఆలోగా కాబోయే భార్యపై అతనికి అనుమానం మొదలైంది. పక్కా ప్లాన్‌ప్రకారం పండుగ కోసం అని పిలిపించి ఓ బావిలో తోసి చంపాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్‌ చేసి పోలీసులు కటకటాల్లోకి పంపారు.

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ పవన్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీరా అరవింద్‌.. మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య సంగీత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్లీ మాట్లాడుకుని ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. ఈనెల 29న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.

కానీ, సంగీత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అరవింద్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన తన ఇంట్లో ఎల్లమ్మ పండుగ ఉందని చెప్పి సంగీతను ఇంటిదగ్గరే ఉండమని చెప్పి ఆమె కుటుంబ సభ్యులను కొత్తతండాకు పిలిపించాడు. అరవింద్‌ ఇటుకలగడ్డతండాకు బైక్‌పై వెళ్లి సంగీతను ఊరి చివరకు రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత ఆమెను బైక్‌పై ఎక్కించుకొని ఇదే మండలం గారిపురం శివారు రోడ్డు వెంబడి ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు.

పథకం ప్రకారం మాటల్లో పెట్టి బావిలోకి తోసేశాడు. ఆమె చనిపోయేంతవరకు అక్కడే ఉన్నాడు. చనిపోయినట్లు నిర్ధారించుకుని తిరిగి కొత్తతండాకు వచ్చాడు. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం కాబోయే భర్త అరవిందే నిందితుడిగా నిర్ధారించారు. అతన్ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు వీరభద్రరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement