ఇక ఆన్‌లైన్‌లో బోనం.. ఈసారి లష్కర్‌ బోనాలతో శ్రీకారం

Laskar Bonal Sending To Devotees Through Online - Sakshi

గోత్రనామాలు నమోదు చేస్తే బోనం సమర్పణ

  పోస్టు ద్వారా బోనంలోని బియ్యం బట్వాడా 

దేవాదాయ శాఖ, తపాలా శాఖ సంయుక్త నిర్వహణ   

సాక్షి, హైదరాబాద్‌ : ఆషాఢమాసం ప్రారంభంతో తెలంగాణలో బోనాల సందడి మొదలవుతుంది. ఈ మాసం మూడో ఆదివారం జరిగే లష్కర్‌ బోనాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. తలపై బోనం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి చేరుకుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అందరూ ప్రత్యక్షంగా బోనం సమర్పించే పరిస్థితులు లేవు. దీంతో ఆలయ నిర్వాహకులకు సరికొత్త ఆలోచన వచ్చింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే మన పేరుతో నిర్వాహకులే అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అందులోని బియ్యాన్ని ప్రసాదంలా పోస్టు ద్వారా ఇంటికి పంపుతారు. వాటిని వండుకుని ప్రసాదంగా స్వీకరించొచ్చు. తొలిసారిగా ఈ ఏడాది లష్కర్‌ బోనాలతో ఈ వినూత్న ప్రయోగానికి దేవాదాయ–తపాలాశాఖలు సంయుక్తంగా శ్రీకారం చుట్టనున్నాయి. 

భద్రాద్రి తలంబ్రాలతో మొదలు 
కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ఆలయాల్లోకి భక్తులను అనుమతించలేదు. ముఖ్యమైన వేడుకలు నిర్వహించుకోవాల్సి వస్తే, ఆలయాలకు వెళ్లకుండానే జరుపుకోవాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తేసినా కరోనా భయంతో చాలామంది ఆలయాలకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భద్రాద్రి రాముడి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే పరిస్థితి లేనందున, ఆన్‌లైన్‌లో గోత్ర నామాలతో పాటు ఇతర వివరాలను ముందుగా నమోదు చేసుకుంటే.. వారి పేరిట పూజాదికాలు నిర్వహించి పోస్టు ద్వారా ముత్యాల తలంబ్రాలు, మిశ్రీ ప్రసాదాన్ని ఇంటికే పంపే ఏర్పాట్లు చేసింది. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్‌ గణేశ్‌ మందిరం, కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి మందిరం, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ ఆలయం, కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ దేవాలయాల్లో కూడా ఆన్‌లైన్‌ పూజలతో పోస్టు ద్వారా ప్రసాదం అందించే వెసులుబాటు కల్పించారు. 

రుసుము రూ.200!
బోనాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి రూ.200 రుసుము నిర్ధారించే వీలుంది. ఆ రుసుమును తపాలాకార్యాలయాల్లో చెల్లించి పేరు నమోదు చేసుకుంటే భక్తుల పేరుతో ఉజ్జయినీ మహంకాళీకి ఆలయ సిబ్బంది బోనం సమర్పించి అందులోని బియ్యం నుంచి 20 గ్రాములు, కుంకుమ, పొడి ప్రసాదాన్ని పోస్టు ద్వారా వారి ఇంటికి పంపుతారు. ఈ మేరకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, భవిష్యత్తులో మరిన్ని దైవిక సేవలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ గణేశ్‌ మందిరంలో మోదక హవనాన్ని నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా తపాలాశాఖతో దేవాదాయ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటోంది. విభూది, పొడి ప్రసాదం, కుంకుమ, గరిక లాంటి వాటిని పోస్టు ద్వారా పంపుతారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top