హెరిటేజ్‌ సిటీ హోదా రావాలి

KTR Attended For MJ Market Reopening Programme - Sakshi

ఎంజే మార్కెట్‌ పునఃప్రారంభంలో మంత్రి కేటీఆర్‌ 

గన్‌ఫౌండ్రీ: హైదరాబాద్‌ నగరాన్ని యునెస్కో హెరిటేజ్‌ సిటీగా గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పునరుద్ధరించిన ఎంజే మార్కెట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఎంతో ఉందని, కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నగర పౌరులపై ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నో సుందర చారిత్రక కట్టడాలకు హైదరాబాద్‌ నగరం నిలయమని, వారసత్వ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎంజే మార్కెట్‌పై 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఏర్పాటు చేశామని, ఈ జెండా ఈ ప్రాంతానికి కొత్త శోభను తెస్తుందని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ చదువుకునే రోజుల్లో ఎంజే మార్కెట్‌ పరిసరాల్లోని మయూరా హోటల్‌ ప్రాంతంలో చాలా ఏళ్లు ఉన్నారని, తాను కూడా చదువుకునే రోజుల్లో ఫేమస్‌ ఐస్‌క్రీమ్‌ కోసం ఎంజే మార్కెట్‌కు వస్తుండేవాడినని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో ఎంజే మార్కెట్‌కు పూర్వ వైభవం కల్పించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. అలాగే రూ.1,000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పున రుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. రెండేళ్లలోనే ఎంజే మార్కెట్‌ను పునరుద్ధరించిన మున్సిపల్‌ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను అభినందించారు. ఎంజేమార్కెట్‌పై రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. దీంతోపాటు ఎంజే మార్కెట్‌కు పున ర్‌వైభవం కల్పించడంలో విశిష్ట సేవలందించిన 16 మందికి మెమెంటోలను అందించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్, ఎంపీలు అసదుద్దీన్‌ ఒవైసీ, కేకే, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

ప్రత్యేక ఆకర్షణగా జాతీయ పతాకం 
ఎంజే మార్కెట్‌పై 100 అడుగుల భారీ ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యాటకులను ఆకర్షించేందుకు మార్కెట్‌ చుట్టూ రంగురంగుల విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు  లోపల పలు నూతన నిర్మాణాలను చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top