టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు 

Korutla Mla Vidyasagar Makes Controversial Comments On Ayodhya Ram Mandir - Sakshi

సాక్షి, జగిత్యాల: అయోధ్యలో చేపట్టనున్న రామమందిర నిర్మాణానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వవద్దంటూ కోరుట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన గ్రామాల్లో రామాలయాలు ఉండగా అయోధ్య రామాలయం మనకెందుకు అంటూ ఆయన ప్రజలనుద్దేశంచి ప్రసంగించారు. రామమందిరం పేరుతో బీజేపీ నాయకులు బిచ్చమెత్తుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తామంతా శ్రీరాముడి భక్తులమేనని, బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. 

ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు కల అని, ఇందులో భాగంగానే ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలని నిధులను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. రామాలయం నిర్మాణ నిధి కోసం తాము ఎవరిని ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో మందిర నిర్మాణానికి అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ నేతలు కలెక్షన్లు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తుంటే, టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top