
ప్రముఖ బాలీవుడ్ స్టార్ జంట రణ్ బీర్ కపూర్, ఆలియా భట్(Alia Bhatt) కోసం మైసూరు శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) ఒక గణపతి మూర్తిని రూపొందించారు. ముంబైలోని రణ్‌బీర్(Ranbir Kapoor) దంపతులు కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇంటికి గణపతి విగ్రహం కావాలని యోగిరాజ్‌కు వారు గతంలోనే ఆర్డర్ ఇచ్చారు. అయోధ్య శ్రీరామ మూర్తిని యోగిరాజే రూపొందించడం తెలిసిందే.
అప్పటి నుంచి యోగిరాజ్ పేరు ప్రతిష్టలు దేశ్యాప్తంగా వ్యాపించాయి. గత ఆరు నెలల నుంచి కష్టపడి నల్ల ఏకశిలతో ఆకర్షణీయమైన గణపతి విగ్రహాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దారు. నాలుగు అడుగుల ఎత్తుతో ఈ విగ్రహం ఉంది. ఈనెల 17న ఆలియా దంపతులు ఇంటిలో ప్రతిష్టించి పూజలు చేయనున్నారు. విగ్రహం ధర ఎంత అన్నది మాత్రం గుట్టుగా ఉంచారు.
కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాల రాముడి (శ్రీ రామ్ లల్లా) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. ముగ్గురు శిల్పులు వేర్వేరు శిలలతో రాముడి శిల్పాలను చెక్కగా అందులో యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్నే ఎంపిక చేశారు. రామ్‌లల్లా అని భక్తులు పిలుచుకునే ఈ చిన్నారి రాముడి విగ్రహాన్ని దాదాపు 4.25 అడుగుల ఎత్తుతో ఎంతో ఆకర్షణీయంగా కృష్ణశిలతో ఆయన తీర్చిదిద్దారు. ఇప్పుడు మరోసారి అలియా భట్ దంపతుల కోసం గణేశుడి విగ్రహాన్ని అందించనున్నారు.