
తమ ఇంటికి వచ్చిన వ్యక్తితో సుస్మిత వాగ్వాదం
మంత్రి ఉత్తమ్, వేం నరేందర్ కూడా..
మా అమ్మ అరెస్టుకు యత్నాలు
మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణ
బంజారాహిల్స్ (హైదరాబాద్): తమ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. రెడ్లందరూ కలసి తమ కుటుంబంపై పగబట్టారని విమర్శించారు. బుధవారం రాత్రి మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది.
జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీ లోని కొండా సురేఖ నివాసం వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి సురేఖ ఓఎస్‌డీ సుమంత్ గురించి ఆరాతీశారు. సుమంత్‌ను అరెస్టు చేసేందుకే వారు వచ్చినట్లు తెలుసుకున్న సుస్మిత బయటకు వచ్చి.. ‘ఎవరి కోసం వచ్చారు?.. ఎందుకొచ్చార’ని ప్రశ్నించారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో మీడియా చేరుకుంది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రాజకీయంగా అణగదొక్కేందుకే..: ఈ వ్యవహారంపై కొండా సుస్మిత ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. బీసీ మంత్రి అయిన తన తల్లిని రాజకీయంగా అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈరోజు సుమంత్‌పై కేసు పెట్టి, అర్ధరాత్రి ఇంటికి పోలీసులను పంపి మా అమ్మను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండటమే మేం చేసిన తప్పా?. రేవంత్‌రెడ్డి మా కుటుంబంపై ఎందుకు పడ్డాడు? రేవంత్‌రెడ్డి అన్నదమ్ములైన తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి పార్టీకి ఏం చేశారని గన్‌మెన్లను ఇచ్చారు?’ అని ఆమె విరుచుకుపడ్డారు. కాగా, జూబ్లీహిల్స్ పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి చేరుకుని మఫ్టీలో వచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో సురేఖ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.