వెంటిలేటర్‌ లేకుండానే ఊపిరి పోస్తుంది

King Koti Doctors Make Non Rebreathing Mask Instead Ventilator - Sakshi

సీప్యాప్‌–నాన్‌ రీబ్రీతింగ్‌ మాస్కు రూపొందించిన కింగ్‌కోఠి వైద్య బృందం

 వెంటిలేటర్‌ అవసరం ఉన్న వారికి ఈ మాస్కు సాయంతో పెరుగుతున్న ఆక్సిజన్‌ లెవెల్స్‌

 ఏడుగురిపై విజయవంతంగా ప్రయోగించిన వైద్య బృందం

 వైద్య శాఖ ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌!

హిమాయత్‌నగర్‌: వెంటిలేటర్‌ అవసరం లేకుండా.. ప్రాణాలను రక్షించేందుకు నాన్‌ రీబ్రీతింగ్‌ మాస్క్‌ను కింగ్‌కోఠి వైద్యులు రూపొందించారు. ఆ మాస్క్‌ ద్వారా సత్ఫలితాలు రావడంతో మరిన్ని మాస్క్‌ల తయారీలో నిమగ్నం అయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి వెంటిలేటర్‌ అవసరం ఉన్న వారికి దీన్ని అమర్చారు. సత్ఫలితాలు రావడంతో వైద్య శాఖ ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మాస్క్‌ల ద్వారా కొందరు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యాక అధికారికంగా ప్రకటించేందుకు వైద్య శాఖ ఉన్నతాధికారులు, కింగ్‌కోఠి వైద్యులు యోచిస్తున్నారు.

వెంటిలేటర్‌ అక్కర్లేదు..
నాన్‌ రీబ్రీతబుల్‌ మాస్క్‌ (ఎన్‌ఆర్‌బీఎం) పేరుతో కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి సీనియర్‌ వైద్యులు ఈ మాస్కులను తయారుచేశారు. ఆక్సిజన్‌ చేరే బ్యాగు నుంచి ముక్కు ద్వారా ఆక్సిజన్‌ ఊపిరితిత్తులకు చేరేలా ఈ మాస్క్‌ రూపొందించారు. వెంటిలేటర్‌పై ఉన్న వారు ధరించే మాస్క్‌నే ఈ ఎన్‌ఆర్‌బీఎం మాస్క్‌లాగా చేయడం విశేషం. మాస్కుకు అనుసంధానంగా ఉన్న బ్యాగుకు ఉన్న పైపును ఆక్సిజన్‌ వచ్చే పైపుకు కలపడం ద్వారా ఈ బ్యాగులోకి ఆక్సిజన్‌ చేరుతుంది. బ్యాగు నుంచి మాస్కు ద్వారా రోగికి ఆక్సిజన్‌ అందుతుంది.

ఈ బ్యాగులోకి ఎక్కువ మొత్తంలో (నిమిషానికి 6 నుంచి 10 లీటర్లు) ఆక్సిజన్‌ను పంపిణీ చేస్తారు. రోగి ఈ ఆక్సిజన్‌ను పీల్చుకున్న తర్వాత బ్యాగుకు ఉన్న చిన్న పైపు ద్వారా ఆ రోగి వదిలే గాలి (కార్బన్‌డయాక్సైడ్‌) బయటకు వెళ్తుంది. అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్‌ అవసరమైన వారికి ఇక్కడి ఆస్పత్రిలో వెంటిలేటర్లు అందుబాటులో లేవు. దీంతో కొద్దిరోజులుగా వెంటిలేటర్‌ అవసరమైన వారికి ఈ మాస్క్‌ను అమరుస్తున్నారు. దీంతో ఆక్సిజన్‌ లెవెల్స్‌ 40–60 నుంచి 90–95 వరకు చేరుకుంటాయని వైద్యులు పేర్కొన్నారు.

ఏడుగురిపై విజయవంతమైన ప్రయోగం
గత వారం రోజుల్లో ఆక్సిజన్‌ లెవెల్స్‌ 40–60కి చేరి, అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్‌ కావాలని కింగ్‌కోఠి ఆస్పత్రికి వచ్చిన వారికి ఈ నాన్‌ రీబ్రీతింగ్‌ మాస్కును అమర్చారు. ఇలా ఇప్పటి వరకు ఏడుగురిపై ఈ మాస్క్‌ను ప్రయోగించడంతో వారికి 40–60 మధ్య ఉన్న ఆక్సిజన్‌ లెవెల్స్‌ 90 నుంచి 95 శాతానికి పెరగడం గమనార్హం.

ఫలితాలిస్తున్న మాస్క్‌ ప్రయోగం
గతంలో ఇదే తరహా మాస్కును వేరే రాష్ట్రాల్లో రూపొందించారు. మా వైద్య బృందం దీనిపై అధ్యయనం చేసి.. ఇక్కడ కూడా అదే తరహాలో మాస్కును తయారు చేసింది. ఈ మాస్కు సత్ఫలితాలు ఇచ్చింది. ఉన్నతాధి కారుల సూచనల మేరకు మరికొందరు కరోనా బాధితులకు దీన్ని అమర్చడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించాం. వెంటిలేటర్‌ అవసరమైన రోగులకు ఈ మాస్కును వినియోగిస్తున్నాం. వీటిని ఇంకా ఎక్కువ మందికి వాడే యోచనలో ఉన్నాం.    
– డాక్టర్‌ రాజేంద్రనాథ్, కింగ్‌ కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top