చెల్లెని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు పయనం

Khammam: Man Going To Supreme Court For Justice To His Sister - Sakshi

సాక్షి, ఖమ్మం: చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేసిన భర్త, ఆయన కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి ఎడ్ల బండిపై ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానానికి బయలుదేరాడు. ఈమేరకు ఆయన మంగళవారం సాయంత్రం బోనకల్‌కు చేరుకోగా వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లకు చెందిన నేలవెల్లి నాగదుర్గారావు చెల్లి నవ్యతను అదే మండలంలోని చందాపురానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. కట్నంగా నగదు, ఆభరణాలు, భూమి ఇచ్చారు.

అయితే ఆమెను సరిగా చూసుకోకపోవడమే కాక నరేంద్రనాథ్, కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని గెంటేశారు. ఈ విషయమై చందర్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యుల ఫొటోలతో ఎడ్లబండిపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారని నాగదుర్గారావు తెలిపారు. ఈమేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు నాగదుర్గారావు చెల్లెలితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ బయలుదేరగా, బోనకల్‌లో పలువురు సంఘీభావం ప్రకటించారు. 
చదవండి: కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top