
మంగళవారం ఓయూలో ఇస్రో చైర్మన్ డా.నారాయణన్‌కు 50వ ఓయూ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ సైన్స్) డిగ్రీ పట్టాను అందచేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఓయూ వీసీ ప్రొ.కుమార్
75 టన్నుల పేలోడ్ మోసుకెళ్లగల సామర్థ్యం
భారీ రాకెట్‌ను రూపొందిస్తున్నామన్న ఇస్రో చైర్మన్
ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం.. ఎ1 రాకెట్ ప్రయోగాలు
మూడేళ్లలో స్పేస్‌లో మన రాకెట్లు మూడింతలు
ఉపగ్రహాల తయారీలో బలమైన శక్తిగా భారత్
ఓయూ 84వ స్నాతకోత్సవంలో డా.నారాయణన్ వెల్లడి
నైపుణ్యాల కేంద్రం ఓయూ: గవర్నర్
ఉస్మానియా యూనివర్సిటీ/షాద్‌నగర్ రూరల్/ఖైరతాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 40 అంతస్తుల భవనమంత పొడవైన రాకెట్‌ను నిర్మిస్తోందని, అది 75 టన్నుల పేలోడ్‌ను తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి మోసుకెళ్లగలదని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ ఏడాది ఇస్రో నావిక్ ఉపగ్రహం, ఎన్ 1 రాకెట్ వంటి ప్రయోగాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారతీయ రాకెట్ ద్వారా 6,500 కిలోల బరువైన అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ‘దివంగత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తయారు చేసిన మొదటి లాంచర్ 17 టన్నుల బరువు ఉండేది. దాని ద్వారా 35 కిలోల పేలోడ్‌ను భూమి దిగువ కక్ష్యలోకి పంపారు.
ఈ రోజు మనం 75 వేల కిలోల పేలోడ్‌ను పంపగల రాకెట్‌ను తయారు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇస్రో భారత నావికాదళం కోసం నిర్మించిన మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీఎస్‌ఏటీ –7ఆర్‌ను ప్రయోగించాలని ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రస్తుత జీఎస్‌ఏటీ –7 (రుక్మిణి) ఉపగ్రహం స్థానంలో సేవలందిస్తుంది. ప్రస్తుతం అంతరిక్షంలో భారత్‌కు 55 ఉపగ్రహాలున్నాయి. రాబోయే మూడునాలుగు సంవత్సరాలలో ఆ సంఖ్య మూడు రెట్లు పెరుగుతుంది’అని వెల్లడించారు.
ఉపగ్రహాల తయారీలో బలమైన శక్తిగా భారత్
ఉపగ్రహాల తయారీలో ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఇతర దేశాల కోసం క్షిపణులు తయారు చేసే స్థాయికి భారత్ ఎదిగిందని నారాయణన్ తెలిపారు. అబ్దుల్ కలామ్ కృషి, పట్టుదల వల్ల ఉపగ్రహాల తయారీలో ఎంతో పురోగతి సాధించామని అన్నారు. తొలిసారి 1980లో ఎస్‌ఎల్వీ–3 క్షిపణిని విజయవంతగా ప్రయోగించినట్లు వివరించారు.
నాటి నుంచి చంద్రయాన్ –3 వరకు ఇస్రో ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో చంద్రయాన్ –4 చేపట్టనున్నట్లు ప్రకటించారు. తన 41 సంవత్సరాల సర్వీసులో ఎన్నో ప్రయోగాలు చేసి టీం వర్క్‌తో అనేక విజయాలు సాధించిన్నట్లు తెలిపారు. పరిశ్రమల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఇస్రో శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు.
అక్షరాస్యత, వైద్యం, విద్యుత్తు, ఆహార ఉత్పత్తులు, రైల్వేలు, విమానయాన సర్వీసులు, టెలిఫోన్, ఆర్థిక రంగంతోపాటు మౌలిక వసతులు, రవాణా తదితర రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించామని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 2035 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
నైపుణ్యాలకు నెలవుగా ఓయూ: గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
ప్రపంచవ్యాప్తంగా ఓయూ పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండటం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర గవర్నర్ జిషు్టదేవ్ వర్మ అన్నారు. విజ్ఞానం, పరిశోధనలతోపాటు విభిన్న రంగాల్లో నైపుణ్యాలకు ఓయూ నెలవుగా ఉందని ప్రశంసించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి నారాయణన్ చేసిన కృషిని గవర్నర్ కొనియాడారు. స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ నారాయణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రదానం చేశారు.
అనంతరం 121 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 1,261 మందికి పీహెచ్‌డీ డాక్టరేట్ డిగ్రీలను అందచేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు పీహెచ్‌డీ డాక్టరేట్ డిగ్రీలు అందుకున్నవారిలో ఉన్నారు.
ఎన్‌ఆర్‌ఎస్‌సీని సందర్శించిన ఇస్రో చైర్మన్
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అన్నారం శివారులో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ను (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) మంగళవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ సందర్శించారు. సుమారు రెండు గంటలపాటు అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. హైదరాబాద్‌లోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్‌ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు.