
పెరుగుతున్న ఉత్తుత్తి బెదిరింపు కాల్స్, ఈ–మెయిల్స్ సంఖ్య
ఆకతాయితనంతోనో, శాడిజంతోనో వికృత చేష్టలు
పోలీసులు, బాంబు స్క్వాడ్‌కు తప్పని ఉరుకులు, పరుగులు
విమానాశ్రయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు టార్గెట్
ఏ ఒక్క కాల్‌నూ తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి
గత ఏడాది దేశవ్యాప్తంగా 997 ఘటనలు..13 మంది అరెస్టు
తెలంగాణలోనూ అడపాదడపా ఉత్తుత్తి కాల్స్, ఈ–మెయిల్స్
సాక్షి, హైదరాబాద్: ‘నాన్నా పులి..’సామెతను గుర్తుచేస్తున్నాయి కొందరి చేష్టలు. బాంబులు పెట్టారంటూ బెదిరింపు ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్‌తో బెదరగొట్టడం.. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఆఘమేఘాల మీద ఉరుకులు, పరుగులు పెట్టడం ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. వీటిల్లో చాలావరకు ఆకతాయితనంతోనో, శాడిజంతోనో చేసే కాల్స్ అయినా సరే..ప్రజా భద్రత దృష్ట్యా ఈ తరహా ఏ ఒక్క ఫోన్‌కాల్‌ను కానీ, ఈ–మెయిల్‌ను కానీ పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ నిజంగానే బాంబు పేలుడు లాంటివి సంభవిస్తే ప్రాణ నష్టం భారీగా జరిగేందుకు అవకాశం ఉంటుంది.
ప్రధానంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ–మెయిల్ రావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. నిందితులు తాము చిక్కకుండా సాంకేతికతను ఉపయోగించి ఈ తరహా ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్ చేస్తున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలుతోంది.
ఐదేళ్లలో పెరిగిన కాల్స్, ఈ–మెయిల్స్
గత ఐదేళ్లలో (2020–2025) దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో ఎక్కువగా వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) ఉపయోగించి విదేశాల నుంచి ఈ–మెయిల్స్ పంపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇలాంటి వారు ఫోన్‌కాల్స్ చేసేవారు, కానీ ఇటీవల ఈ–మెయిల్‌లు సోషల్ మీడియాకు మారడం, వీపీఎన్ వాడకంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. 2024లో దేశవ్యాప్తంగా ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసిన వారిలో 13 మందిని అరెస్టు చేయగా.. అందులో తెలంగాణలో ఒకరిని అరెస్టు చేశారు.
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ ఇలా..
» 2020–2021లో కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ఇలాంటి కాల్స్ సంఖ్య తక్కువగా ఉంది.
» 2022లో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు సుమారు 100కు పైగా బాంబు బెదిరింపు కాల్స్ వచి్చనట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో చాలావరకు నకిలీవిగా గుర్తించారు. హైదరాబాద్ సహా పలు నగరాల్లోని సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకు ఈ తరహా బెదిరింపు కాల్స్ వచ్చాయి.
» 2023లో బాంబు బెదిరింపుల సంఖ్య మరింత పెరిగింది. ఢిల్లీలోని స్కూళ్లు, ఆసుపత్రులు, మెట్రో స్టేషన్లకు బెదిరింపు కాల్స్, ఈ–మెయిల్స్ వచ్చాయి. ఈ ఏడాదిలో 500కు పైగా బెదిరింపు కాల్స్, ఈ–మెయిల్స్ నమోదయ్యాయి. వీటిల్లోనూ చాలావరకు ఉత్తుత్తివిగా తేలాయి.
» 2024లో 997 బాంబు బెదిరింపు కాల్స్ నమోదయ్యాయి. 2024 జూన్‌లో ఒక్క రోజులోనే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో కలిపి 50కి పైగా విమానాశ్రయాలు, 40కి పైగా ఆసుపత్రులకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్‌లో రెండు వారాల్లోనే 500 విమానాలకు ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
» 2025 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా వందలాది బెదిరింపు కాల్స్, ఈ–ఇమెయిల్స్ నమోదయ్యాయి. జనవరిలో ఢిల్లీలోని 15కి పైగా ఆసుపత్రులు, పలు విమానాశ్రయాలకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి.
తెలంగాణలో ఇలా..
» 2022లో హైదరాబాద్‌లోని కొన్ని షాపింగ్ మాల్స్, స్కూళ్లకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. దర్యాప్తు తర్వాత ఇవి నకిలీవిగా తేలాయి.
» 2023లో హైదరాబాద్‌లోని పలు స్కూళ్లు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. వీటిల్లో ఎక్కువగా విదేశీ సర్వర్ల నుంచి వచ్చిన ఈ–మెయిల్స్ ఉన్నాయి.
» 2024లో హైదరాబాద్‌లోని స్కూళ్లు, కాలేజీలు, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 22న హైదరాబాద్‌లోని ఒక సీఆర్‌పీఎఫ్ స్కూల్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అదేవిధంగా మేలో ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్టు నకిలీ బెదిరింపు కాల్ చేసిన ఒక వ్యక్తిని హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు.
»2025లో మంగళవారం సిటీ సివిల్ కోర్టు సహా పలు చోట్ల బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.