
సాక్షి, అడ్డగుట్ట: ప్రేమ పేరుతో కోచ్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రఘు బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాలాపేటలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసముంటున్న ప్రమోద్‌కుమార్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
వారి పెద్ద కుమార్తె మౌలిక(19) అలియాస్ వెన్నెల తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. అదే కాలేజీలో మాణికేశ్వర్ నగర్‌కు చెందిన అంబాజీ అనే యువకుడు కొన్ని నెలల క్రితం వాలీబాల్ కోచ్‌గా జాయిన్ అయ్యాడు. కొద్ది రోజులుగా అతను మౌలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన మౌలిక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు
పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబాజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతురాలి సెల్‌ఫోన్‌లో డేటా పూర్తిగా డిలీట్ చేసి ఉందని, డేటాను రిట్రీవ్ చేస్తున్నట్లు చెప్పారు. అంబాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.