చదువుకోవాలా..? బాత్‌రూంలు క్లీన్‌ చేయాలా?

Incident at Utnoor Tribal Welfare College - Sakshi

వైస్‌ ప్రిన్సిపాల్‌ మాకొద్దంటూ విద్యార్థినుల ఆందోళన  

ఉట్నూర్‌ గిరిజన సంక్షేమ కళాశాలలో ఘటన

ఉట్నూర్‌రూరల్‌: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్‌రూంలు క్లీన్‌ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్‌ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్‌ప్రిన్సిపాల్‌ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్‌ ప్రిన్సిపాల్‌ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు.

విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ గంగాధర్‌ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్‌ ప్రిన్సిపాల్‌ భూలక్ష్మి తమతో బాత్‌రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.

మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్‌రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్‌ కోఆర్డినేటర్‌ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్‌ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేయాలని విద్యార్థినులు డిమాండ్‌ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్‌ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్‌ ప్రిన్సిపాల్‌ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top