వివాహేతర సంబంధంతో.. భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు.. | A Woman Murdered Husband With Help Of Her Boyfriend | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంతో.. భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు..

Oct 7 2023 11:16 AM | Updated on Oct 7 2023 11:23 AM

An Incident Of Extramarital Murder - Sakshi

మహబూబ్నగర్: వాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హతమార్చి మృతదేహాన్ని దుప్పట్లో మూటకట్టి ముళ్లపొదల్లో పడేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి కథనం మేరకు.. దేవరకద్ర మండలం గూరకొండకు చెందిన గడుగు శ్రీనివాసులు (34)కు మక్తల్‌ మండలం దాసరిదొడ్డికి చెందిన మాధవి అలియాస్‌ హారతితో నాలుగు ఏళ్ల కిందట వివాహం జరిగింది.

వీరికి మూడేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. మాధవికి గూరకొండకు చెందిన గడుగు యమన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. మాధవి పుట్టింటికి వెళ్లగా ఈ నెల 1న ఇంట్లో నుంచి ఆటోలో బయలుదేరిన శ్రీనివాసులు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ రావడంతో 2వ తేదీన శ్రీనివాసులు సోదరుడు మరికల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మూడురోజుల పాటు పోలీసులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఎవరిమీదైనా అనుమానం ఉందా అని కుటుంబ సభ్యులను ఆరా తీయగా అదే గ్రామానికి చెందిన యమన్న పేరు చెప్పారు.

దీంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నిజాన్ని బయటపెట్టాడు. ఈ నెల 1న ఇంట్లో నుంచి బయటకు వచ్చిన శ్రీనివాసులును గమనిస్తున్న యమన్న మరికల్‌లో శ్రీనివాసులును కలిశాడు. భూత్పూర్‌లో ప్రధాని మోదీ సభకు వెళ్దామని శ్రీనివాసులు చెప్పగా వద్దు దాసరిదొడ్డిలోని నీ భార్య దగ్గరకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు.

అక్కడికి కూడా వెళ్లకుండా రాష్ట్ర సరిహద్దులోని దేవసుగూర్‌ సమీపంలో కృష్ణానది వద్దకు తీసుకెళ్లి అక్కడే శ్రీనివాసులును హతమార్చి దుప్పట్లో మూటకట్టి ముళ్లపొదల్లో పారేశాడు. నిందితుడు చెప్పిన విధంగా శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో పోస్టుమర్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని.. మాధవి సహకారంతోనే శ్రీనివాసులును యమన్న హత్య చేశాడని ఎస్‌ఐ వివరించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement