
సాక్షి, హైదరాబాద్: భారతదేశం సొంతంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ విమానాలను పెద్దస్థాయిలో తయారు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాదీ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ ఇందుకు దన్నుగా నిలుస్తోంది. తేజస్ విమానంలో అత్యంత కీలకమైన సెంట్రల్ ఫ్యూసలాజ్‌ను ఈ సంస్థ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
మూడు నెలల క్రితమే తొలి ఫ్యూసలాజ్‌ను తేజస్‌ను నిర్మిస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు అందించిన వెమ్ టెక్నాలజీస్ శుక్రవారం రెండో యూనిట్ డెలివిరిని పూర్తి చేసింది. అంతేకాదు.. ఆరు నెలల్లోపు మరో మూడు ఫ్యూసలాజ్‌లను సిద్ధం చేసి అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు ఈ పరిణామం ఎంతో కీలకమైంది.
యుద్ధ విమానంలో సెంట్రల్ ఫ్యూసలాజ్ అనేది చాలా కీలకమైన భాగం. తేజస్ మార్క్1ఏలోని ఫ్యూసలాజ్ సుమారు 478 కిలోల బరువు ఉంటుంది. అత్యంత కచ్చితత్వంతో తయారు చేసిన సుమారు 1560 విడిభాగాలతో ఈ ఫ్యూసలాజ్ తయారవుతుంది. యుద్ధ విమానాన్ని నడిపైవారు కూర్చునే కాక్‌పిట్, విమానపు రెక్కలు, తోకలన్నింటిని కలిపే ఈ ఫ్యూసలాజ్‌లోనే ల్యాండింగ్ గేర్, ఫ్యూయెల్ ట్యాంక్‌లు ఉంటాయి.
వెమ్ టెక్నాలజీస్‌కు చెందిన సుమారు 122 మంది ఇంజినీర్లు కొన్ని నెలలపాటు శ్రమించి ఈ ఫ్యూసలాజ్‌ను తయారు చేశారు ప్రతిదశలోనూ రక్షణ రంగం ప్రమాణాలకు అనుగుణంగా పనిచేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో వెమ్ టెక్నాలజీస్ ఈ సాధనకు ప్రాముఖ్యత ఏర్పడుతోంది. రక్షణ రంగానికి సంబంధించిన సంక్లిష్టమైన ప్రాజెక్టులను కూడా ప్రైవేట్ రంగం సమర్థంగా చేపట్టగలదని వెమ్ టెక్నాలజీస్ నిరూపిస్తోందని విశ్లేషకుల అంచనా.
భారతదేశం పూర్తిగా దేశీయంగా సిద్ధం చేస్తున్న తేజస్ యుద్ధ విమానాన్ని హెచ్‌ఏఎల్ నాశిక్‌లోని ఫ్యాక్టరీలో తయారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సెంట్రల్ ఫ్యూసలాజ్‌ల డెలివరీని పూర్తి చేసిన వెమ్ టెక్నాలజీస్ వచ్చే ఏడాది మార్చిలోగా మరో మూడింటిని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తేజస్ సెంట్రల్ ఫ్యూసలాజ్‌తోపాటు వెమ్ టెక్నాలజీస్ అత్యాధునిక మధ్యమశ్రేణి యుద్ధ విమానం (ఏఎంసీఏ) భాగాలను కూడా తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి దేశీ క్షిపణులు, రాకెట్లు, లాంచర్ల తయారీకి సిద్ధమవుతోంది.