ఆహా..ఆన్‌లైన్‌ షాపింగ్‌.. అన్నీ అక్కడే!

Hyderabad: People Very Much Intrested To Online Shopping For Dussehra - Sakshi

పండుగల వేళ పెరిగిన ఈ–కామర్స్‌ బిజినెస్‌

పూజా సామగ్రి నుంచి పిండి వంటకాల వరకు..

ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే గ్రేటర్‌ జనం మొగ్గు

సాక్షి, హైదరాబాద్‌: దసరా..దీపావళి పండుగల వేళ సిటీజనులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు. రొటీన్‌కు భిన్నంగా వీరు కొత్త దుస్తులు, వాహనాలు, ఇతర గృహోపకరణాలు, పిండి వంటలు, డైలీ నీడ్స్‌ తదితరాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జనం ఆసక్తికి అనుగుణంగానే పలు ఆన్‌లైన్‌ కంపెనీలు వాటి వ్యాపార ధృక్పథాన్ని మార్చుకున్నాయి. భారీ ఆఫర్లు, ట్రెండీ ఉత్పత్తులు, సత్వర డెలివరీ వంటి అంశాలతో ఆకట్టుకుంటున్నాయి. 
చదవండి: ‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’

♦  పలు ఈ–కామర్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన గంట నుంచి మూడు గంటల్లోనే వస్తువులను వినియోగదారుల చెంతకు చేరుస్తున్నాయి. 
♦ దీంతో మార్కెట్‌కు వెళ్లి షాపింగ్‌ చేయడం కంటే..ఇంట్లో కూర్చుని ఒక్క క్లిక్‌తో అనుకున్నది పొందొచ్చనే ధోరణి ఇటీవల బాగా పెరిగింది. 
♦ గ్రేటర్‌లో కరోనా ప్రభావం తగ్గినా కూడా పండుగ పూట జనం బయటికి వెళ్లడం లేదు. ఉన్నచోటనే ఉంటూ తమకు నచ్చిన దుస్తులు, ఫుట్‌వేర్, హోం అప్లయన్సెస్, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఐటమ్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. 
చదవండి: Huzurabad Bypoll: హుజూరాబాద్‌కు అమిత్‌ షా?

♦ షాపింగ్‌ మాల్స్‌కు ధీటుగా ఆన్‌లైన్‌లోనూ డిస్కౌంట్లు, ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.  
♦ వాస్తవంగా కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌లో ఆన్‌లైన్‌ సేల్స్‌కు మంచి ఆదరణ లభించింది. అదే పంథా ఇప్పటికీ కొనసాగుతోంది. 
♦ గతంలో మాదిరిగా చాలా మంది కుటుంబ సమేతంగా వెళ్లి షాపింగ్‌ చేయడం తగ్గించారు. 
♦ ఇంటి వద్దకే అన్ని వస్తువుల డోర్‌ డెలివరీకి అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆన్‌లైన్‌కే వైపు మొగ్గు చూపుతున్నారు.  

ఈ– కామర్స్‌ సైట్లతో ఒప్పందాలు
♦ ఆన్‌లైన్‌ బిజినెస్‌ బాగా పెరగడంతో పలు షోరూంలు, మాల్స్, షాపుల నిర్వాహకులు సైతం వారి పంథాను మార్చుకున్నారు. ఈ–కామర్స్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపి వారితో ‘టై–అప్‌’ అవుతున్నారు. ఆన్‌లైన్‌ వేదికలుగా వారి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. 
♦ ఎమ్మార్పీ కంటే 15 నుంచి 50 శాతం  వరకు ఆఫర్‌తో సేల్‌ చేసేలా అగ్రిమెంట్‌ చేసుకుంటున్నారు. ఏటా నిర్వహించే ఫెస్టివల్‌ క్లియరెన్స్‌ సేల్స్‌ తరహాలోనే ఉన్న స్టాక్‌ను  ఆన్‌లైన్‌లో అమ్మేలా వ్యాపారులు ప్రణాళికలు రచిస్తున్నారు. 
♦ చిన్న, పెద్ద వ్యాపారులను డిజిటల్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ఈ–కామర్స్‌ సంస్థలు కూడా అఫిలియేటివ్, సెల్లర్‌ బిజినెస్‌ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. 

రూ.100 కోట్లకు పైనే.. 
ఈ సీజన్‌లో గ్రేటర్‌ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు ఆన్‌లైన్‌లో వ్యాపారం జరిగినట్లు వివిధ ఈ కామర్స్‌ సంస్థల ద్వారా తెలుస్తోంది. పండుగల నేపథ్యంలో భారీ తగ్గింపులు, ఆఫర్ల వల్ల వినియోగదారులు బాగా ఆకర్షితులయ్యారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కువగా మొబైల్‌ ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు, ఎల్రక్టానిక్‌ గూడ్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేశారని తెలుస్తోంది. వీటి తర్వాత గ్రోసరీస్‌ను కూడా పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు వెల్లడవుతోంది. 

రోజుకు 20 నుంచి 25 వస్తువుల డెలివరీ 
దసరా పండుగ సీజన్‌లో కొనుగోళ్లు బాగా పెరిగాయి. నేను రోజుకు 20 నుంచి 25 ఐటమ్స్‌ వినియోగదారులకు డెలివరీ చేస్తున్నా. గతంలో కేవలం ఐదు నుంచి ఎనిమిది మాత్రమే ఉండేవి. 
– రాకేష్‌, ఆన్‌లైన్‌ సంస్థ డెలివరీ బాయ్, బర్కత్‌పుర   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top