Private School Teachers: ప్రైవేట్‌ టీచర్లకు గురుదక్షిణ

Hyderabad: Man Help Private Teachers Name Of Gurudhakshina - Sakshi

పలువురికి నిత్యావసర సరుకుల అందజేత 

ఇప్పటికే సుమారు 800 మందికి చేయూత 

ఆసరాగా నిలుస్తున్న సుధీర్‌ బికుమాండ్ల 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఎంతోమంది బతుకు చిత్రం ఛిద్రమైంది. మహమ్మారి శాంతించిందనే తరుణంలోనే సెకండ్‌ వేవ్‌ రూపేణా విరుచుకుపడింది. విద్యారంగాన్ని కకావికలం చేసింది. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు మళ్లీ మూతపడటంతో టీచర్లు, లెక్చరర్ల ఉపాధి అటకెక్కింది. వీరికి ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ అది అందరికీ చేరట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నగరవాసి సుధీర్‌ బికుమాండ్ల ‘గురుదక్షిణ’ పేరుతో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నిత్యావసర సరుకులను అందిస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. 

కలచివేసిన కష్టాలు.. 
► అందరి భవిష్యత్‌కు మార్గదర్శకులు గురువులే. అలాంటి వారి జీవితాలు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారాయి. ఉన్నపళంగా ఉద్యోగాలు పోవడం, మళ్లీ చేర్చుకునే అవకాశాలు కనిపించకపోవడంతో దిక్కులేని పక్షులే అయ్యారు. ఈ తరుణంలో ఉగాది రోజున  ‘గురుదక్షిణ’ కార్యక్రమం మళ్లీ మొదలుపెట్టారు సుధీర్‌ బికుమాండ్ల.  

► ఇప్పటికే 800 మందికిపైగా ప్రైవేట్‌ టీచర్లకు, లెక్చరర్లకు నిత్యావసర వస్తువులను అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సేవలను గతేడాది లాక్‌డౌన్‌లో ప్రారంభించి 2 వేల మందికిపైగా అందించినట్లు చెప్పారు. సెకండ్‌ వేవ్‌లో ఎందరో గురువులు కిరాణా షాపుల్లో పనిచేయడం, ఇంటింటికీ తిరిగి దినపత్రికలు వేయడం తనని కలచి వేసిందని, అందుకే తన అవసరాల కోసం దాచుకున్న లక్ష రూపాయలతో గురుదక్షిణ కార్యక్రమాన్ని పునఃప్రారంభించానన్నారు.  

► తను అందించే కిట్‌లో 20 కేజీల బియ్యం, పప్పులు, నూనె, రవ్వ, చక్కెర, చింతపండుతో పాటు 14 రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయి. కర్మన్‌ఘాట్‌లోని ఇందిరా నాగేంద్ర థియేటర్‌ సమీపంలో ‘గురుదక్షిణ’ కేంద్రం ఉందని, అక్కడికి ప్రైవేట్‌ బోధనా సిబ్బంది ఎవరైనా సరే వచ్చి సరుకులు తీసుకోవచ్చని ఆయన సూచించారు.   

► గురుదక్షిణ కార్యక్రమం గురించి సోషల్‌ మీడియాలో తెలుసుకుని సుదూర ప్రాంతాల నుంచి టీచర్లు వస్తున్నారని వివరించారు. ముందుగానే ఉస్మానియా వర్సిటీ సహా పలు కాలేజీల్లో తిరిగి తన కార్యక్రమం గురించి వివరించినట్లు సుధీర్‌ బికుమాండ్ల చెప్పారు. 

(చదవండి: ఉద్యోగుల ఆశలపై మళ్లీ నీళ్లు చల్లిన కరోనా మహమ్మారి )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top