Google Map Updates: గూగుల్‌ మ్యాప్స్‌లోకి ‘ట్రాఫిక్‌ అడ్డంకుల’ అప్‌డేట్‌

Hyderabad: Google Maps Give Traffic Jam Alerts and Suggest Best Routes - Sakshi

ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు సన్నాహాలు

ఇప్పటివరకు రద్దీ మాత్రమే కనిపిస్తున్న వైనం

‘511ఎన్‌వై’కు దీటుగా అభివృద్ధికి చర్యలు

సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్న ట్రాఫిక్‌ వింగ్‌ 

Google Maps Suggest Best Routes In Hyderabad: అత్యవసర పని మీద దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి కూకట్‌పల్లి వెళ్లడానికి బయలుదేరిన ఓ వాహన చోదకుడు ఆ దారిలో రద్దీని గూగుల్‌ మ్యాప్స్‌లో పరిశీలించాడు. రద్దీ సాధారణ స్థాయిలో ఉన్నట్లు కనిపించడంతో బయలుదేరాడు. ఆ వాహనం లక్డీకాపూల్‌ చేరుకునేసరికి.. కొద్దిసేపటి ముందే తలెత్తిన ధర్నా కారణంగా భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆ రద్దీలో చిక్కుకుపోయిన అతడు ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తేల్చకోలేకపోయాడు.  

నగరవాసులకు ఇలాంటి సమస్య తలెత్తకుండా చూసేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ట్రాఫిక్‌ రద్దీ మాత్రమే కనిపించే గూగుల్‌ మ్యాప్స్‌లో హఠాత్తుగా తలెత్తే అడ్డంకులూ కనిపించేలా చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆ సంస్థతో జరిపిన సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయి. ఉన్నతాధికారుల తుది పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో కార్యరూపంలోకి రానుంది. దీనిపై ఇప్పటికే పలు దఫాల్లో ట్రాఫిక్‌ పోలీసులు–గూగుల్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు.  

స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరగడంతో.. 
► ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో గూగుల్‌ మ్యాప్స్‌కు విశేష ప్రజాదరణ వచ్చింది. చిరునామాలు కనుక్కోవడానికి, ట్రాఫిక్‌ స్థితిగతులు తెలుసుకోవడానికి వీటిని ఎక్కువగా వాడుతున్నారు.  

► స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు గూగుల్‌ సంబంధిత యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడు లొకేషన్‌కు యాక్సెస్‌ ఇస్తుంటారు. ఇలా ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్‌ తెలుసుకునే అవకాశం గూగుల్‌ సంస్థకు కలుగుతోంది.  

► వీటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఏ దిశలో సెల్‌ఫోన్లు ఎక్కువగా ఉన్నాయనేది గుర్తిస్తుంది. రహదారులపై ఉన్న సెల్‌ఫోన్లు సాధారణంగా వాహనచోదకులవే అయి ఉంటాయి.  

► ఇలా రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్‌ సంస్థకు చేరుతున్నాయి. వీటి ఆధారంగానే ఆ సంస్థ తమ మ్యాప్స్‌లో ట్రాఫిక్‌ రద్దీ ఉన్న రహదారుల్ని ఎరుపు రంగులో చూపిస్తుంటుంది.  

► న్యూయార్క్‌ పోలీసు విభాగం ‘511ఎన్‌వై’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ నిర్వహిస్తోంది. ఇందులో రహదారులపై ఉన్న రద్దీతో పాటు హఠా త్తుగా వచ్చిపడే అవాంతరాలను చూపిస్తుంటుంది. దీని మోడల్‌లోనే తమ మ్యాప్స్‌ అభివృద్ధి చే యడానికి  గూగుల్‌ సంస్థ ముందుకు వచ్చింది. 

నగరం నుంచే పైలెట్‌ ప్రాజెక్టుగా.. 
► ట్రాఫిక్‌ పోలీసుల కోరిన మీదట పైలెట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ నుంచే ఈ విధానాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్‌ పోలీసులు– గూగుల్‌ ప్రతినిధుల సమావేశాలు ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జరిగాయి. 

► క్షేత్రస్థాయిలో సంచరించే హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సిబ్బంది వద్ద ట్యాబ్స్‌ ఉన్నాయి. మరోపక్క ట్రాఫిక్‌ పోలీసులకు సంబంధించి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌ పేరుతో ప్రత్యేక యాప్‌ కూడా ఉంది. ఇది వారి ట్యాబ్స్, స్మార్ట్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసి ఉంటోంది.  

వెంటనే అప్రమత్తం.. 
► రహదారిపై హఠాత్తుగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా, నిరసనలు తలెత్తినా స్థానికంగా ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు అక్కడకు వెళ్తారు. అలా వెళ్లినప్పుడు సదరు ఉదంతం, కార్యక్రమం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటే వెంటనే అప్రమత్తం అవుతారు.  

► ఈ విషయాన్ని తమ యాప్‌లో పొందుపరుస్తారు. ఇది ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉండే అడ్మినిస్ట్రేటర్‌కు చేరుతుంది. ఆయన దాన్ని మరోసారి ఖరారు చేసుకుని ఆన్‌లైన్‌లో గూగుల్‌ సంస్థకు పంపిస్తారు. (క్లిక్‌: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌! ఆ రెండు రోజులు ఆటోలు బంద్‌)

► ఆ సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని తమ మ్యాప్స్‌లో పాయింట్‌తో సహా పొందుపరుస్తారు. ఆ ప్రాంతానికి అటు ఇటు ఉన్న ప్రత్యామ్నాయ రహదారుల వివరాలను ట్రాఫిక్‌ పోలీసుల నుంచి సేకరించి గూగుల్‌ మ్యాప్స్‌లో పాప్‌అప్‌ రూపంలో వినియోగదారులకు తెలియజేస్తారు.  

► వీటిని తన స్మార్ట్‌ఫోన్ల ద్వారా తెలుసుకునే వాహనచోదకులు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా, ప్రత్యామ్నాయ మార్గల్లో వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సాంకేతిక అంశాలకు సంబంధించి తుది పరిశీలనలో ఉన్న ఈ విధానం త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. (చదవండి: కోవిడ్‌ పోయింది.. హైబ్రిడ్‌ వచ్చింది!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top