Hyderabad Autos Bandh: ప్రయాణీకులకు అలర్ట్‌! ఆ రెండు రోజులు ఆటోలు బంద్‌

Hyderabad Passenger Auto Unions Bandh Call On 28 And 29 March - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్‌: ఆటో చార్జీలు పెంచాలని కోరుతూ పలు ఆటో సంఘాలు ఈ నెల 28, 29 తేదీల్లో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్‌లను ఆదుకొనేందుకు చార్జీలు పెంచాలని, కొత్తగా మరో 20 వేల పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్, క్యాబ్‌ యూనియన్స్‌ జేఏసీ నేతలు బి.వెంకటేశం, సత్తిరెడ్డి, మల్లేష్‌ గౌడ్, మారయ్య, అమానుల్లాఖాన్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌లో భవిష్యత్‌ కార్యాచరణపై ఆటో, క్యాబ్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. నగరంలో 8 ఏళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో ఆటోడ్రైవర్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా క్యాబ్, ఆటోలకు డిమాండ్‌  తగ్గిపోయిందని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆటో మీటర్‌ చార్జీలు కనీసం రూ.40.., కిలో మీటర్‌కు రూ. 25 చొప్పున పెంచాలని కోరారు. సీఎన్జీతో నడిచే 20 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వృద్ధాప్య పించన్లు, ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం, వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఏపీలో ఇస్తున్నట్లుగా ప్రతి ఆటో డ్రైవరుకూ రూ.10 వేలు ఇవ్వాలని అన్నారు. ఇతర జిల్లాల్లోని ఆటోలు హైదరాబాద్‌ నగరంలో తిరగకుండా నిషేధం విధించాలన్నారు. 

(చదవండి: కీసరగుట్టలో అడవుల్లో కార్చిచ్చు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top