హైదరాబాద్‌లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్‌ | Hyderabad Blood Donation Scam Cyber Fraud Helpline, Check Out Full Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్‌

Jul 18 2025 8:12 AM | Updated on Jul 18 2025 10:11 AM

Hyderabad Blood Donation Scam Cyber Fraud Helpline Details

మానవత్వం మంటగలిసిపోతోంది.. అమూల్యమైన సేవలకు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.. కొందరి అమాయకత్వం, అవసరం.. ఇంకొందరికి వరంగా మారుతోంది.. సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఓ వైపు యువత స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకొస్తుంటే.. మరికొందరు బాధితుల అవసరాన్ని సైతం సొమ్ము చేసుకుంటున్నారు!!.

ఇటీవలి కాలంలో రక్తదానంపై అవగాహన పెరగడంతో చాలా మట్టుకు ఆపద సమయాల్లో అవసరం తీరుతోంది. సరిగ్గా అదే అదునుగా కొందరు కేటుగాళ్లు బరితెగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి ఆస్పత్రులకు వచ్చేవారిని టార్గెట్‌ చేస్తూ బాధితులకు టోకరా వేస్తున్నారు.. మానవత్వం ముసుగులో సమాజం సిగ్గుతో తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు.. బ్లడీ చీటర్స్‌.. అంతేకాదు.. డబ్బు స్వాహా చేసేదే కాకుండా అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

వివిధ ఆరోగ్య సమస్యలతో నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌తో పాటు జాతీయ స్థాయిలో పేరొందిన పలు కార్పొరేట్‌ ఆస్పత్రులకు అనేక మంది బాధితులు వస్తుంటారు. సరిగ్గా వీరినే ఆసరా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. సేవ పేరుతో సమాజం తలదించుకునే మోసానికి తెరతీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమని సోషల్‌ మీడియాల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెట్టే విజ్ఞప్తులను క్యాష్‌ చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు.. అమూల్యమైన వారి సమయాన్ని ధనార్జన కోసం ఫణంగా పెడుతున్నారు.

సమాచారమే.. వారి డేటా..
అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం కుటుంబసభ్యులు, మిత్రుల ద్వారా సామాజిక మాధ్యమైలన వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్‌ వంటి వాటిల్లో సహాయం కోరేవారి వివరాలే వారికి డేటాగా మారుతోంది.. అలాంటి సమాచారాన్ని సేకరించిన మోసగాళ్లు దాతల పేరుతో తక్షణమే బాధితులకు ఫోన్‌ చేస్తారు. 

‘నాకు ఫలానా గ్రూపులో మెసేజ్‌ కనిపించింది. నేను రక్తం ఇవ్వడానికి సిద్ధం. కానీ నేను నగరానికి దూరంలో ఉన్నాను.. అయితే నా దగ్గర ప్రస్తుతం ట్రావెల్‌ చేయడానికి డబ్బులు లేవు.. మీరు ఏమీ అనుకోకుండా ఫోన్‌పేగానీ, గూగుల్‌పేగానీ చేస్తే వెంటనే వస్తాను.. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో రావాలంటే సమయం పడుతుంది.. మీరు అర్జెంట్‌ అంటున్నారు కావబట్టి క్యాబ్‌ చార్జీలు ఇస్తే చాలు’ అని చెబుతారు.. డబ్బులు వేశాక ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసేస్తారు.. ఆపదలో ఉన్న బాధితులు ఎలాగో పోలీసు స్టేషన్‌కి వెళ్లే పరిస్థితి ఉండదు.. ఒక వేళ వెళ్లినా వెయ్యి, రెండు వేల కోసం ఫిర్యాదు ఏం చేస్తాంలే.. అనే ఆలోచనతో ఉంటారు.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వేరే దాత కోసం వేటలో పడతారు..  

రోజువారీ ఖర్చులకు.. బాధ్యతారాహిత్యంగా.. 
మానవీయ విలువలు లేని వారు.. పక్కవాడి బాధను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి మోసాలకు పాల్పడరు.. మరీ ముఖ్యంగా రోజు వారీ ఖర్చుల కోసం కొందరు యువత ఇలా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు.. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, గేమింగ్, బెట్టింగ్, డేటింగ్‌ యాప్స్‌ ఖర్చుల కోసం అవగాహనా రాహిత్యంతో.. మేం చేసేది చిన్న మోసమేగా అనే అపోహతో.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అంతేకానీ తాము చేసే ఈ చిన్న తప్పిదం వల్ల సమాజానికి ఓ పెద్ద ప్రమాదం జరుగుతోందని, ఓ నిండు ప్రాణం బలైపోయే పరిస్థితి ఉందని, ఓ కుటుంబం రోడ్డున పడుతుందనిగానీ ఆలోచించలేని మైండ్‌ సెట్‌ ఉన్నవారు మాత్రమే ఈ తరహా మోసానికి పాల్పడతారని చెబుతున్నారు. వీరి వల్ల నిజంగా రక్తం ఇచ్చే దాతలకు కూడా చెడ్డపేరు వస్తుందని, చివరికి మంచి వారిపై కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆలోచించకుండా మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.

సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌..
అవసరం, అమాకత్వం వంటివే మోసగాళ్లకు అనుకూలంగా మారే అంశాలు.. మరీ ముఖ్యంగా నగరంలో భాష సమస్య కూడా ఓ కారణమే. ఇలాంటి తరుణంలో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్‌ క్రైమ్‌ సెల్‌కు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలపై సైబర్‌ క్రైమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930 లేదా  www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. హైదరాబాద్‌ నగరం మరోసారి ‘గివింగ్‌ సిటీ’గా నిలవాలంటే.. ప్రజలతోపాటు, పోలీస్, హెల్త్‌ డిపార్ట్‌మెంట్, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది.

:::సాక్షి, సిటీబ్యూరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement