
సైదాబాద్ చిల్డ్రన్ హోంలో ఘటన
కేసు నమోదు.. గార్డ్ స్టాఫ్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బాలసదనంలోని ఓ బాలుడిపై లైంగిక దాడి జరిగింది. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి ఆ బాలుడు వెళ్లగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ బాల సదనంలోని ఓ బాలుడిపై కొంత కాలంగా అక్కడే పనిచేస్తున్న గార్డ్ స్టాఫ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడు అస్వస్థతకు లోనయ్యాడు.
అనుమతి లేకున్నా, షార్ట్ లీవ్ మంజూరు చేశారు. దీంతో ఆ బాలుడు ఇంటికి వెళ్లాడు. నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్.. ఆ బాలుడు లైంగిక దాడికి గురైనట్టు నిర్ధారించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సైదాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలసదనానికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఉద్యోగి (గార్డ్ స్టాఫ్)ని శనివారం రాత్రి అరెస్టు చేశారు.
మరికొందరిపైనా దాడి...: ఈ బాలసదనంలో మొత్తం 77 మంది చిన్నారులున్నారు. లైంగిక దాడి విషయంపై పోలీసులు ఆదివారం కూడా ఆరా తీశారు. మరో నలుగురిపైనా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. వారిని పోలీసులు ప్రత్యేకంగా విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఈ దాడి వెనుక మరో ఇద్దరు ఉద్యోగుల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది.
నిత్య వైద్య పరీక్షలేవీ?: వాస్తవానికి విద్యార్థులకు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఈ మేరకు అక్కడ శాశ్వత ప్రాతిపదికన డాక్టర్‌ను నియమించినా, ఆయన బాలసదనానికి చుట్టపుచూపుగా వస్తుంటాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోచోట ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తుండటంతో ఆయన ఇక్కడ విధులకు సకాలంలో హాజరుకారనే ప్రచారం ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించినట్టు సమాచారం.