
కేంద్రమా? రాష్ట్ర ప్రభుత్వమా?జీహెచ్‌ఎంసీనా?
కేబుల్ దుర్ఘటనపైతీవ్రంగా స్పందించిన హైకోర్టు
విద్యుత్ స్తంభాలపై కేబుళ్ల తొలగింపుపై సర్కార్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ‘కేబుల్ వైర్ల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దీనికి బాధ్యులెవరో చెప్పండి? ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు అన్యాయంగా దుర్మరణం చెందారు. అందుకు బాధ్యులు కేంద్రమా? రాష్ట్రమా? జీహెచ్‌ఎంసీనా? కేబుల్ ఆపరేటర్లా? ఎవరికి వారు మాకు సంబంధం లేదని చెప్పడం దుర్మార్గం. కేబుళ్ల పునరుద్ధరణ సమస్యే కాదు’అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్ల తొలగింపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో విద్యుదాఘాతంతో ఐదుగురు మృతి చెందిన విషయం విదితమే. పాతబస్తీలో మరో నలుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారతి ఎయిర్ టెల్ బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు.
మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ.. కేబుల్ వైర్ల ఏర్పాటు కోసం ముందుగా అన్ని అనుమ తులు తీసుకుని.. రూ.21 కోట్లు చెల్లించా మని తెలిపారు. ప్రభుత్వం తొలగించాలని నిర్ణయం తీసుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వాలని, కానీ నోటీసులివ్వకుండా కేబుళ్లను కట్ చేయడం సరికాదని వాదించారు.
గృహాలకు కేబుల్ తీసుకున్న వారు కూడా విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటున్నారని, అందుకు తమను బాధ్యులను చేయడం తగదని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్నెట్ సేవలు అందక డాక్టర్లు, న్యాయవాదులు, ఐటీ ఉద్యోగులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. టీజీఎస్పీడీసీఎల్, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. సమస్య వచ్చినప్పుడల్లా ఇలా పిటిషన్లు వేస్తున్నారని అన్నారు. గతంలో ఇలాగే పిటిషన్ వేసి ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు.
విద్యుత్ స్తంభాలపై పరిమితికి మించి కేబుళ్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ దశలో తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. వైర్ల తొలగింపుపై లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు. అప్పటివరకు వైర్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్‌కు సూచించారు.
వివరాలను మా ముందు ఉంచండి: లోకాయుక్త
సాక్షిలో వచ్చిన ‘కృష్ణుడి శోభాయాత్ర విషాదాంతం’వార్తకు లోకాయుక్త స్పందించింది. ఐదుగురు మృతి చెందిన ఘటనపై సుమోటోగా విచారణకు స్వీకరిస్తూ.. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, టీజీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ (ఆపరేషన్స్), ఉప్పల్ సీఐని ఆదేశించింది. వచ్చే నెల 11లోగా వివరాలను సమర్పించాలని ఆదేశించింది.