
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీన సమయంలో లండన్‌కు తరలించిన నిజాం నిధి విషయమై ఏడవ నిజాం ముని మనవరాలు ప్రిన్సెస్ షఫియా సకినా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. నిజాం నిధిని ఇద్దరు వారసులకు మాత్రమే ఇచ్చేందుకు కేంద్రం అనుమతించడం చట్టవిరుద్ధమని, వారసులందరికీ ఆ నిధిని పంచేలా ఆదేశాలు జారీచేయాలంటూ సకినా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇందుకు స్పందించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రిన్స్ ముకరంజా బహదూర్, ప్రిన్స్ ముఫకంజా బహదూర్‌లతోపాటు నిజాం ట్రస్ట్ కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావలి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.