చరిత్రలో తొలిసారి! 

Godavari Krishna Water Levels Rise Gates Lifted - Sakshi

కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత 

కృష్ణాపై ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా.. 

గోదావరిపై గైక్వాడ్‌ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ.. 

మొదటిరోజే సాగర్‌ 26 గేట్లూ ఎత్తి దిగువకు నీటి విడుదల 

సాక్షి, హైదరాబాద్‌/ నాగార్జునసాగర్‌/ గద్వాల రూరల్‌/ దోమలపెంట (అచ్చంపేట)/భద్రాచలం: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు.. కృష్ణా, గోదావరి, వాటి ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు ఎగువ నుంచి భారీగా ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే గోదావరిపై గైక్వాడ్‌ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. ఇలా కృష్ణా, గోదావరి బేసిన్లలో మొత్తం ప్రాజెక్టులన్నీ నిండటం, అలాగే కృష్ణా బేసిన్‌లో అన్ని రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారని అధికారవర్గాలు తెలిపాయి. 

కడలివైపు కృష్ణమ్మ 
కృష్ణా నదిపై కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్‌కు ఎగువన ఉన్న రెండు చిన్న బ్యారేజీలు జూన్‌ ఆఖరుకే నిండిపోయాయి. ఆల్మట్టి, నారాయణపూర్‌ జూలై మొదటి వారానికే నిండాయి. అప్పటి నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిండిపోయాయి. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం 4,30,107 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

దీంతో పది గేట్లు 15 మీటర్ల మేర ఎత్తి, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 4,53,917 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇక సాగర్‌ 26 రేడియల్‌ క్రస్ట్‌గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 26 గేట్లను మొదటిరోజే ఎత్తడం 2009 తర్వాత ఇదే మొదటిసారి. సాగర్‌ నుంచి భారీగా వరద వస్తుండడంతో వరద నియంత్రణ చర్యల్లో భాగంగా పులిచింతలలో నీటి నిల్వను 30 టీఎంసీలకు తగ్గిస్తూ 4.41 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు.

దాంతో ప్రకాశం బ్యారేజీ వైపు వరద బిరా బిరా పరుగులు పెడుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,18,909 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,539 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,06,370 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

మహాసముద్రాన్ని తలపిస్తోన్న గోదావరి
గోదావరి నది మహాసముద్రాన్ని తలపిస్తోంది. సాధారణంగా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. కానీ ఈ ఏడాది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో జూలై రెండో వారంలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మరోసారి ఉధృతంగా ప్రవహిస్తోంది. గైక్వాడ్‌ నుంచి బాబ్లీలో అంతర్భాగమైన 11 బ్యారేజీ గేట్లను మహారాష్ట్ర సర్కార్‌ ఎత్తేసి.. దిగువకు వరదను విడుదల చేస్తోంది.

వాటికి సింగూరు, నిజాంసాగర్‌ నుంచి విడుదల చేస్తున్న మంజీర ప్రవాహం తోడవుతుండటంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. శ్రీరాంసాగర్‌ నుంచి వదులుతున్న వరదకు కడెం వాగు వరద తోడవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిన గేట్లను ఇప్పటిదాకా దించలేదు. జూలై 8న పోలవరం ప్రాజెక్టు 48, ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తేశారు. ఇప్పటిదాకా వాటిని దించలేదంటే గోదావరి వరద ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.  

మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి ప్రవాహం గురువారం మూడో ప్రమాద హెచ్చరిక జారీకి చేరువయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు 51.30 అడుగులుగా ఉన్న నీటిమట్టం మెల్లగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటలకు 52.30 అడుగుల మేర ఉండగా, 13,86,192 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

ముంపు బెడద గ్రామాలు ఎక్కువగా ఉన్న దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. దుమ్ముగూడెం మండలం యటపాకతో పాటు బూర్గంపాడు – సారపాకల మధ్య గల ఉన్న ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం నుంచి భారీ వరద వస్తుండ టం.. వాటికి శబరి ప్రవాహం తోడ వుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top