నేటి నుంచి పూర్తిగా కరోనా రోగులకే సేవలు

Gandhi Hospital Converted Into A Full Fledged Covid Hospital From April 17th - Sakshi

సర్జరీలు, ఓపీ సేవలన్నీ నిలిపివేత

సాధారణ ఇన్‌పేషెంట్లు డిశ్చార్జి

ఎమర్జెన్సీ రోగులు ఇతర ఆస్పత్రులకు తరలింపు

 ప్రస్తుతం ఈఎస్‌ఐ, కింగ్‌ కోఠి ఆస్పత్రులు దాదాపు ఫుల్‌

 ఏరియా ఆస్పత్రులు, యూసీహెచ్‌సీల్లోనూ పడకలు

హఠాత్తుగా డిశ్చార్జి చేయడంతో దిక్కుతోచని బాధితులు

సాక్షి, హైదరాబాద్, గాంధీ ఆస్పత్రి: రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం, మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని మళ్లీ పూర్తి స్థాయి కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ సేవలు, సర్జరీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న సాధారణ రోగులను డిశ్చార్జి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో గాయపడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నవారిని ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. 

నాన్‌ కరోనా కేసులు పెరుగుతుండటంతో..
గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్‌ వరకు గాంధీ ఆస్పత్రి పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వైద్య విద్యార్థుల అభ్యర్ధన మేరకు.. జనవరి నుంచి సాధారణ ఓపీ, ఇన్‌పేషెంట్‌ సేవలను కూడా ప్రారంభించారు. మొత్తం 1,890 పడకల్లో 300 పడకలను కోవిడ్‌ విభాగానికి కేటాయించి, మిగతా సేవలు అందించారు. అయితే కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. గాంధీలో కోవిడ్‌ బెడ్లను కూడా పెంచుతూ వచ్చారు. తాజాగా మళ్లీ పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్‌గా ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో ఒక్క రోజే 152 మంది హెల్త్‌ సీరియస్‌గా ఉన్న కరోనా రోగులు అడ్మిట్‌ కావడం ఆందోళనకరంగా మారింది. గాంధీలో 400 వెంటిలేటర్, 1,250 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రోగుల సంఖ్య మరింత పెరిగితే ఓపీ విభాగం, లైబ్రరీ భవనాల్లో మరో 300 బెడ్లు అదనంగా ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు రంగం సిద్ధం చేశారు.

సాధారణ రోగులకు ఇబ్బంది
ప్రస్తుతం గాంధీలో 462 మంది కోవిడ్, 923 మంది నాన్‌ కోవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. నాన్‌ కోవిడ్‌ విభాగంలో సాధారణ సమస్యలతో చికిత్స పొందుతున్నవారు 75 శాతం వరకు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే వారిని డిశ్చార్జి చేయడం మొదలుపెట్టారు. అయితే ఇలా హఠాత్తుగా డిశ్చార్జి చేసి ఆస్పత్రి నుంచి వెళ్లిపొమ్మంటుండటంతో రోగులు, వారి బంధువులు అయోమయానికి గురవుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన రోగులు అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆందోళనలో పడ్డారు. ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా కొందరు అనివార్య పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు

ఉస్మానియా దాదాపు ఫుల్‌
ఉస్మానియా పాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే ఆ భవనాన్ని ఖాళీ చేశారు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఓపీ, కులీకుతుబ్‌షా భవనంలో కలిపి 948 పడకలు అందుబాటులో ఉండగా.. ఇప్పటికే 630 మంది ఇన్‌ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇక గాంధీ నుంచి పెద్ద సంఖ్యలో రిఫరల్‌పై వచ్చే రోగులను ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియక వైద్యులు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉస్మానియాకు రోజూ సగటున 1,800 నుంచి 2,000 వరకు ఓపీ రోగులు వస్తున్నారు. గాంధీ మూతపడటంతో ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. ఈ పరిస్థితుల్లో ఓపీ, ఇన్‌పేషెంట్లకు చికిత్స ఎలాగన్న ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు ఈఎస్‌ఐ, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఏరియా ఆస్పత్రుల్లో బెడ్లు పెంపు
రోగుల రద్దీ నేపథ్యంలో ప్రస్తుతమున్న కోవిడ్‌ ఆస్పత్రులకు అదనంగా.. కొత్తగా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో 8, హయత్‌నగర్‌ సీహెచ్‌సీలో 6, జంగమ్మెట్, సీతాఫల్‌మండిలో 10 పడకల చొప్పున, శ్రీరాంనగర్‌ యూసీహెచ్‌సీలో ఐదు పడకలు అదనంగా సమకూర్చారు.

ప్రజల ప్రాణాలు కాపాడేందుకే..
‘‘కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకే గాంధీని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చుతున్నారు. గాంధీలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పడకలు, ఇతర వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇక్కడ శనివారం నుంచి కేవలం కోవిడ్‌ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సీరియస్‌గా ఉన్న 462 మంది కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాం.’’ -రాజారావు, గాంధీ సూపరింటెండెంట్

హైదరాబాద్‌లోని పలు కోవిడ్‌ ఆస్పత్రుల్లో బెడ్లు, రోగుల లెక్క ఇదీ..
ఆస్పత్రి                             మొత్తం బెడ్లు    రోగులు
గాంధీ ఆస్పత్రి                           1,890        424        
టిమ్స్‌                                        1,261        455
ఈఎస్‌ఐ                                        109        102
కొండాపూర్‌                                    110          09
కింగ్‌కోఠి                                         350        240
చెస్ట్‌ ఆస్పత్రి                                 123         53

చదవండి: సాధారణ కరోనా రోగులకు బెడ్స్‌ లేనట్టే..!
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు మళ్లీ పాజిటివ్‌.. ఆస్పత్రికి తరలింపు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top