
మహిళకు బెదిరింపులు..కేసు నమోదు
హైదరాబాద్: ‘తన కోరిక తీర్చకపోతే, తనతో రాకపోతే, తన ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే నీ భర్తతో పాటు పిల్లలను చంపేస్తా’ అంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లోని బండారు బాల్‌రెడ్డినగర్ బస్తీలో నివసించే వివాహిత (35) హౌస్ కీపింగ్ పని చేస్తున్నది. ఇదే బస్తీలో నివసించే సి.రవికుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూనే పరిచయాన్ని అడ్డదారుల్లోకి నెట్టాడు. ఆమె పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు బయటకు రావాలంటూ బెదిరించేవాడు.
తన కోరిక తీర్చాలంటూ హెచ్చరించేవాడు. దీంతో ఆమె రవికుమార్ చేస్తున్న ఫోన్లకు సమాధానం ఇవ్వకపోవడంతో ఇటీవల ఆమెను వెంబడించసాగాడు. దీంతో ఆమె పని కూడా మానేసింది. అంతటితో ఊరుకోని నిందితుడు ఆమె భర్తకు కూడా ఫోన్ చేయసాగాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. బుధవారం మళ్లీ ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు రవికుమార్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 75 (2), 78, 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.