Telangana MLC Elections: నామినేషన్లు ముగిశాయ్‌.. క్యాంపులు షురూ

Filing Of Nominations For Telangana MLC Seats Completed - Sakshi

చివరిరోజు కరీంనగర్‌లో అత్యధికంగా 27 నామినేషన్లు

నేడు పరిశీలన, 26 వరకు ఉపసంహరణ

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటాలో 12 శాసనమండలి స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారం ముగిసింది. చివరి రోజు టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌ మినహా పూర్వపు తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానాలకు ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా బుధవారం నామినేషన్ల పరిశీలన, 26 వరకు ఉపసంహరణ తర్వాత బరిలో మిగిలే అభ్యర్థుల జాబితాపై స్పష్టత రానుంది.

ఈ కోటా కింద ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో టీఆర్‌ఎస్‌కు చెందినవారే అధికంగా ఉన్నారు. అయితే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.  చివరి రోజు అత్యధికంగా కరీంనగర్‌ నుంచి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ సమర్పించారు. 

టీఆర్‌ఎస్‌ నామినేషన్లు ఇలా..: మెదక్‌ అభ్యర్థిగా డాక్టర్‌ యాదవరెడ్డి రెండో సెట్‌ నామినేషన్‌ పత్రా లు దాఖలు చేయగా,  నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్‌ సమర్పించారు. పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి,   నల్లగొండ స్థానం నుంచి ఎంసీ కోటిరెడ్డి కోటిరెడ్డి, ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా   తాతా మధు, ఆదిలాబాద్‌ స్థానం నుంచి దండె విఠల్‌ నామినేషన్‌ వేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు రెండో సెట్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు స్థానాలకు ఎల్‌.రమణ, తానిపర్తి భానుప్రసాద్‌ నామినేషన్లు వేశారు. 

రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు శైలజారెడ్డి, ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు నిర్మలాశ్రీశైలంగౌడ్‌ సహా మరో 10 మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు  నామినేషన్లు వేసేందుకు వచ్చారు. అధికార పార్టీకి చెం దిన నాయకులు వీరిని అడ్డు కుని నామినేషన్‌ పత్రాలను చించివేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.  ఈ గందరగోళంలోనే, శేరిలింగంపల్లికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ చలిక చంద్రశేఖర్‌ చాకచక్యంగా లోపలికెళ్లి స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలుచేశారు. 

మంత్రులకు బాధ్యతలు: సంఖ్యా పరంగా ఎక్కు వ మం ది ఓటర్లను కలిగి ఉన్న టీఆర్‌ఎస్‌ వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవంగా గెలుపొందేలా వ్యూహరచ న చేస్తోంది. పార్టీ ఓటర్లు చేజారకుండా ఉండేందుకు ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు క్యాంపులకు తరలించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులకు ఓటర్ల మద్దతు కూడగట్టడం, క్యాంపుల నిర్వహణ, అసంతృప్తుల బుజ్జగింపు, స్వతంత్రులకు నచ్చచెప్పి పోటీ నుంచి వైదొలిగేలా చూడటం వంటి బా«ధ్యతలు అప్పగించారు.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఓటర్లను మంగళవారం సాయంత్రానికే హైదరాబాద్‌ సమీపంలోని ఓ రిసార్టుకు తరలించినట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top