పేద, మధ్య తరగతి దంపతులకు సంతాన ప్రాప్తిరస్తు! 

Fertility Centers Started In Gandhi And Petlaburj Maternity Hospital - Sakshi

ప్రసూతి ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు 

గాంధీ, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రుల్లో చికిత్స  

ఒక్కో సెంటర్‌లో రూ.ఐదు కోట్లతో అత్యాధునిక వైద్యపరికరాలు 

అందుబాటులోకి ఐవీఎఫ్‌ సేవలు... తీరనున్న పేద దంపతుల కష్టాలు   

సాక్షి, సిటీబ్యూరో: సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి దంపతులకు ఇకపై సర్కారీ ప్రసూతి ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు గాంధీ, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆరోగ్య కేంద్రాల్లో అత్యాధునిక హంగులతో కూడిన సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకం కింద ఒక్కో సెంటర్‌లో రూ.5 కోట్ల చొప్పున ఖర్చు చేసి, చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను, ల్యాబ్‌లను సమకూర్చనుంది. ఖరీదైన ఈ సేవలను ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద, మధ్య తరగతి దంపతులకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఐయూవీ (ఇంట్రాయుటెరిన్‌ ఇన్‌సెమినేషన్‌)తో పాటు ఐవీఎఫ్‌(ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) సేవలను ఉచితంగా పొందే అవకాశం పేదలకు లభించనుంది.  

పిల్లలకోసం ‘ప్రైవేటు’కు పరుగులు 
నిజానికి ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరక్క ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. దీనికి తోడు గంటల తరబడి ల్యాప్‌టాప్‌లను ఒళ్లో పెట్టుకుని పని చేస్తుండటంతో ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. ఆకలేసినప్పుడల్లా క్యాంటిన్లో రెడిమేడ్‌గా దొరికే పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో ఇది స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీకెండ్‌ పార్టీ పేరుతో అతిగా మద్యం తాగడం వల్ల  దాంపత్య సమస్యలు తలెత్తుతున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో ప్రస్తుతం పట్టణాలకు, పల్లెలకు పెద్ద తేడా లేదు. ఫలితంగా ప్రస్తుతం ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు.

చివరకు సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇవి ఖరీదుతో కూడిన చికిత్సలు కావడంతో ప్రస్తుతం ఈ సేవలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. . ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇవి లేకపోవ డంతో పేద, మధ్య తరగతి దంపతులు పిల్లల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపై వారికి పైసా ఖర్చు లేకుండా ఈ ఖరీదైన సేవలను అందించాలని ప్రభుత్వం భావించించింది. రూ.ఐదు కోట్లతో అత్యాధునిక ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు మరో రూ.రెండు కోట్లతో మందులు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చునుంది.  

పేద దంపతులకు ఇదో వరం 
రెండేళ్ల క్రితం ప్రభుత్వం గాంధీలో ప్రయోగత్మాకంగా సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతి గురువారం ఓపీలో సేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 400 మందికి ఐయూవీ (ఇంట్రాయుటెరిన్‌ ఇన్‌సెమినేషన్‌), మరో 8 వేల మందికి సాధారణ చికిత్సలు అందించాం. కరోనా కారణంగా గత మార్చి నుంచి ఈ సేవలను నిలిపివేయాల్సి వచి్చంది. ప్రస్తుతం కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ ఈ సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించాం. ప్రభుత్వం కొత్తగా కేటాయించిన నిధులతో కీలకమైన ఐవీఎఫ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. – డాక్టర్‌ మహాలక్ష్మి, గైనకాలజిస్ట్, గాంధీ  ఆస్పత్రి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top