
డాక్టర్ నమ్రతతో చేతులు కలిపి నిందితులుగా మారిన పలువురు సామాన్యులు
9 కేసుల నమోదు.. 25 మంది అరెస్ట్
పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి అనేక కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: సంతాన సాఫల్య కేంద్రం ముసుగు వేసుకుని, సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణా, క్రయవిక్రయాలు చేపట్టిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న డాక్టర్ నమ్రత ఉచ్చులో మిగిలిన నిందితులు ఎలా చిక్కుకున్నారనేది దర్యాప్తు అధికారులు గుర్తిస్తున్నారు. ఈ నేరాలకు సంబంధించి ఇప్పటివర కు 9 కేసులు నమోదు కాగా... 25 మంది నిందితులను అరెస్టు చేశారు.
‘సృష్టి’కేంద్రంగా సాగించిన వ్యవహారాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్న నగర పోలీసు విభాగం, ఈ కేసులో అత్యంత కఠినమైన బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 111ను జోడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఎం.నందిని ఘట్‌కేసర్ సమీపంలోని రాంపల్లిలో నివాసం ఉండేది. ఈమె 2010లో కొన్నాళ్లపాటు జీడిమెట్లకు చెందిన తన స్నేహితురాలి తల్లి వద్ద నివసించింది. ఆమె తరచూ క్లినికల్ ట్రయల్స్ కోసం ల్యాబ్‌లకు వెళుతుండేది. అప్పుడప్పుడు నందినిని తనతో తీసుకువెళ్లేది. ఇలా డబ్బు సంపాదించడం కోసం నందిని కూడా క్లినికల్ ట్రయల్స్‌కు క్లయింట్‌గా మారింది.
2017లో బెంగళూరులో క్లినికల్ ట్రయల్‌కు హాజరవుతున్న సమయంలో సంజయ్ అనే వ్యక్తిని కలిశారు. 2018లో వీళ్లు వివాహం చేసుకుని మౌలాలీలో కాపు రం పెట్టారు. 2025 జనవరిలో నందిని తన అండాన్ని దానం చేయడానికి బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే ఈమెకు మరో నిందితురాలు హర్ష రాయ్‌తో పరిచయమైంది. అప్పటినుంచి స్నేహితులుగా మారిన వీళ్లు అండాలను దానం చేసే వారి వివరాలు మారి్పడి చేసుకునే వాళ్లు.
ఈ నేపథ్యంలోనే వీరికి మరో నిందితురాలు ధనశ్రీ సంతోషితో పరిచయం ఏర్పడింది. సంతోషి ద్వారా నందిని, హర్షరాయ్ నమ్రత ఉచ్చులో చిక్కారు. ఈ నేపథ్యంలో అసోంకు చెందిన భార్యాభర్తలు తమకు పుట్టిన చిన్నారిని డాక్టర్ నమ్రతకు విక్రయించారు. ఆమె ఈ చిన్నారిని రాజస్తాన్‌కు చెందిన దంపతులకు అమ్మింది. ఈ దంపతుల ఫిర్యాదుతోనే సృష్టి విష యం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సంతో షి, హర్ష రాయ్‌లపై మహారాష్ట్రలోని విఖ్రోలి పోలీసుస్టేషన్‌లోనూ చిన్నారుల అక్రమ రవాణా కేసు ఉంది.
డ్రైవర్‌గా వచ్చి.. కీలకంగా మారి..
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన ఎం.పవన్ మోహన్ కృష్ణ నగరానికి వలసవచ్చి పద్మారావు నగర్‌లోని ఓ బాలుర హాస్టల్‌లో ఉండేవాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఇచ్చిన యాడ్ అతడిని ఆకర్షించింది. డ్రైవర్ పోస్టుకు సంబంధించిన ఆ ప్రకటన చూసిన పవన్ మోహన్ ఆ సెంటర్‌లో సంప్రదించాడు.
అయితే డ్రైవర్ పోస్టు కోసం వెళ్లిన మోహన్‌ని ఆస్పత్రి నిర్వాహకులు సూపర్‌వైజర్‌గా చేర్చుకున్నారు. ఆ ఉద్యోగంలో చేరడంతోనే డా.నమ్రతతో పరిచయం ఏర్పడి, ఈ కేసులో నిందితుడిగా మారాడు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసికి ఒప్పించడం విధిగా మార్చుకున్న ఇతడికి, నమ్రత ఒక్కో క్‌లైంట్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల కమీషన్ ఇచ్చేది. అలా కొన్నాళ్లకు సికింద్రాబాద్‌లోని సృష్టి సెంటర్ నిర్వహణలో ఇతడు కీలకంగా మారాడు.