
సాక్షి, హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సృష్టిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్‌కు డాక్టర్ నమ్రత పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నమ్రతను త్వరలోనే ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సృష్టి ఫెర్టిలిటీ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. విశాఖ కేంద్రంగానే సరోగసీ పేరుతో పెద్ద ఎత్తున పిల్లల విక్రయాలు జరిగినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదివిన ముగ్గురు వైద్యులను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు కేజీహెచ్‌లో పనిచేస్తుండగా, మరొకరు శ్రీకాకుళం జిల్లాలో సేవలందిస్తున్నారు. వీరిలో ఒకరు బెయిల్‌పై విడుదలవగా, మరో ఇద్దరు రిమాండ్‌లో ఉన్నారు. 1988 బ్యాచ్‌లో వైద్య విద్య చదివి వైద్యులుగా స్థిరపడ్డ మరికొందరి పాత్ర కూడా ఇందులో ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. వారి వివరాలను ఇప్పటికే తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆయా వైద్యుల బ్యాంకు ఖాతాలను పరిశీలించి భారీగా నిధులు జమైన సందర్భాలపై ఆరా తీస్తున్నారు.
ఫోన్లు స్విచ్ఛాఫ్..
‘సృష్టి’ కేసు బయటకు రావడం.. ముగ్గురు 1998 బ్యాచ్ వైద్య విద్యార్థినులను అరెస్టు చేయడంతో మిగతావారి ఫోన్లు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రావడం లేదని సమాచారం. దీంతో పోలీసుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. మరింత మంది ఈ దందాలో ఉన్నట్లు వెలుగు చూడడంతో వైద్య వర్గాల్లో గుబులు రేపుతోంది. గౌరవనీయమైన వైద్య వృత్తిలో ఉంటూ సరోగసి ముసుగులో అక్రమాలకు పాల్పడడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.