జీవన ‘సాగరాలవి’.. ఆ ఆలోచన సరికాదు | Sakshi
Sakshi News home page

జీవన ‘సాగరాలవి’.. ఆ ఆలోచన సరికాదు

Published Sat, Mar 19 2022 1:44 AM

Expert Anjireddy Response on GO 111 Removal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాలు హైదరాబాద్‌ నగరానికి ‘జీవనరేఖ (లైఫ్‌లైన్‌)’గా ఉన్నాయని, వాటి పరిరక్షణ అత్యంత కీలకమని జేఎన్టీయూ ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్, ఎన్విరాన్‌మెంటల్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎం.అంజిరెడ్డి పేర్కొన్నారు. జలాశయాలకు ఏమాత్రం నష్టం జరగకుండా ఉం డేలా సాంకేతిక నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో జీవో 111కు సవరణలు చేయవచ్చని సూచించారు. అంతేతప్ప జలాశయాలతో ఉపయోగం లేదనడం, ఎత్తేయాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు.

కొన్ని దశాబ్దాల కిందటి వరకు మంచినీటి వనరుగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ కాలుష్య కాసారంగా మారిపోయిందని, భవిష్యత్‌లో జంట జలాశయాలకు ఆ దుస్థితి రాకుండా చూడాలని చెప్పారు. రిజర్వాయర్లను మాత్రమేకాకుండా, వాటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పర్యావరణ చట్టాలు, కేంద్ర నిబంధనల మేరకు పరిరక్షించాల్సి ఉందన్నారు. జీవో 111, జంట జలాశయాల అంశాలపై అంజిరెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చా రు. ఇందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

సుస్థిర అభివృద్ధి చర్యలు చేపట్టాలి 
జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న 1.34 లక్షల ఎకరాలకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, ఎగువ నుంచి వచ్చే జలాలు, డ్రైనేజీ వ్యవస్థలు, చెరువుల నెట్‌వర్క్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. చెరువులు, పర్యావరణ వ్యవస్థలకు నష్టం జరగకుండా చూడాలి. జలాశయాలకు నష్టం కలిగిస్తూ ఇక్కడి భూమిని అభివృద్ధి చేయాలని ఎక్కడా లేదు.

టెక్నికల్‌ కమిటీ క్షుణ్నంగా పరిశీలించాలి 
111 జీవో పరిధిలోని గ్రామాల రైతులకు నష్టం జరగకుండా ‘సాంకేతిక నిపుణుల కమిటీ’ప్రతి ఊరిలో భూమిని పరిశీలించాలి. వాగుల నెట్‌వర్క్‌ ఎలా ఉంది, అక్కడి నీరు ఎక్కడికి వెళుతుందనేది చూడాలి. ఆ ప్రకారం ఏయే ఏరియాలు, ఏయే సర్వే నంబర్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగలమో, జీవో 111కు ఏమేర సడలింపులు ఇవ్వాలో నిర్ణయిస్తే.. జంట జలాశయాలకు నష్టం వాటిల్లదు. దీనికి సంబంధించి చాలా కచ్చితంగా 1.34 లక్షల ఎకరాలను పరిశీలించాలి. 

ఫామ్‌హౌజ్‌లకు వీలుగా చట్టాలు చేయొచ్చు 
జీవో 111ను ఎత్తేయకుండా.. దీని పరిధిలో ఫామ్‌హౌజ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు చట్టమే చేయొచ్చు. ఉదాహరణకు పదెకరాల స్థలముంటే.. అందులో 20 శాతం దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవచ్చనే మార్గదర్శకాలు నిర్దేశించవచ్చు. ఆ నిర్మాణాల నుంచి వృధా జలాలు బయటికి రాకుండా.. శుద్ధి చేయడం, ఇతర అవసరాలకు వినియోగించడంపై నిబంధనలు పెట్టవచ్చు. 

దిగువ ప్రాంతాల్లో అనుమతులిచ్చాం! 
111 జీవోకు సంబంధించి 2007–13 మధ్య నేను చైర్మన్‌గా ఉన్న ఏపీ ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ (ఎన్విరాన్‌మెంటల్‌ కమిటీ).. జంట జలాశయాలకు నష్టం కలిగించని దిగువ ప్రాంతం (డౌన్‌ స్ట్రీమ్స్‌)లో అనుమతులిచ్చింది. అయితే 20వేల చదరపు మీటర్లు దాటే నిర్మాణాలకు సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ) ఉంటేనే అనుమతులిచ్చే విషయాన్ని కచ్చితంగా పాటించాం. ఘన, ద్రవ వ్యర్థాల నివారణ చర్యలు చేపట్టేలా చూశాం. దీనికి సంబంధించి ప్రతీ ఫైల్‌ తప్పకుండా మున్సిపల్‌ శాఖ ఆమోదం పొందాకే మా దగ్గరకు వచ్చేలా చర్యలు తీసుకున్నాం.  

ఇలాంటి సహజ రక్షణ ఎక్కడా లేదు
‘‘హైదరాబాద్‌ వంటి వినూత్న లక్షణాలు, భౌగోళిక పరిస్థితులు, సహజ రక్షణ ఉన్న నగరం మరొకటి లేదు. కొండలు, గుట్టలు, ఇతర సహజ లక్షణాలతో ఉన్న క్యాచ్‌మెంట్‌ ఏరియాలతో కూడిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్లు.. హైదరాబాద్‌ నగరానికి ‘జీవనరేఖ’ (లైఫ్‌లైన్‌)గా ఉపయోగపడుతున్నందున వాటి సంరక్షణ కీలకంగా మారింది. వీటి పరిధిలో పర్యావరణ వ్యవస్థలను, బయో కన్జర్వేషన్‌ జోన్‌లను కాపాడాలి. 

Advertisement
Advertisement