
సాక్షి, సనత్‌నగర్: ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని చంపేస్తానంటూ ఓ యువతిని బెదిరించిన ఆమె మాజీ ప్రియుడి బెదిరించిన ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు అతడిపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్ ఎల్‌బీఎస్‌నగర్‌కు చెందిన యువతికి రవికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో, పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే రవికుమార్ కొన్నాళ్లుగా ఆమెను వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా ఇరువురూ మళ్లీ కలవబోమని అంగీకరించారు.
ఇదిలా ఉండగా సదరు యువతికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్.. వరుడికి ఫోన్ చేసి ఆమె గురించి చెడుగా చెప్పాడు. అంతేకాకుండా బాధితురాలికి ఫోన్ చేసి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అతడిని చెంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.