
‘స్థానిక’ రిజర్వేషన్ల పెంపుపై తొలగని సందిగ్ధత
ఇప్పటివరకు వెలువడని ఆర్డినెన్స్
ఇంకా రాజ్‌భవన్‌కే చేరలేదంటూ అధికార వర్గాల్లో చర్చ
ఏజీని గవర్నర్ పిలిపించి ఆరా తీశారనే ప్రచారం
ఎన్నికల సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలన్నీ బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ చుట్టే తిరుగుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రాతిపదికగా సర్వత్రా చర్చ సాగుతోంది.
కేంద్రం అనుమతి పొందేలా ఒత్తిడి తీసుకుని వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇదే జరిగితే స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించిన రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు ఏ మేరకు అవకాశం ఉందన్నదీ ఆసక్తికరంగా మారింది.
అయితే ఇందుకు వీలుగా గత ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ చట్టం–2018ని సవరిస్తూ, కాంగ్రెస్ సర్కార్ తాజాగా ముసాయిదా ఆర్డినెన్స్‌ను ఆమోదించడం తెలిసిందే కాగా..ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ ఏమైందనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ఇంకా రాజ్‌భవన్‌కే చేరలేదనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.
మరోవైపు గవర్నర్ న్యాయ సలహా కోరినట్టు, అడ్వకేట్ జనరల్‌ని పిలిపించి 50 శాతానికి మించి రిజర్వేషన్ల పెంపుదలకు ఏ మేరకు అవకాశం ఉందని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో వాస్తవంగా ఆర్డినెన్స్ పరిస్థితి ఏంటి? ఎక్కడుంది? అనే సందిగ్ధత ఏర్పడింది.
ఎన్నికలపై నేతల్లో ఉత్కంఠ
హైకోర్టు ఆదేశాల మేరు సెపె్టంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పక్షాల్లో, పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, జెడ్పీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు రెండు టర్మ్‌ల పాటు ఉండగా...ఇప్పుడు ఒక్కసారికే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు జెడ్పీపీలు 31కే (మేడ్చల్ మల్కాజిగిరి జడ్పీపీ కనుమరుగు) పరిమితం కావడం, మేడ్చల్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లోని పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం లేదా కొత్త పురపాలికల ఏర్పాటు వంటి వాటితో రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఎన్నికల ఏర్పాట్లలో పీఆర్‌శాఖ, ఎస్‌ఈసీ బిజీ బీజీ...
రిజర్వేషన్ల పెంపుదల ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొంది, స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా..ఆ వెంటనే కార్య రంగంలోకి దూకేలా పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సన్నద్ధమౌతున్నాయి.
ఈ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లలో పీఆర్‌ఆర్‌డీ అధికారులు, ఉద్యోగులు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను సరిపోల్చుతూ గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను కార్యదర్శులు ఇప్పటికే రూపొందించారు. ఈ జాబితాలను ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లోనూ రిజిష్టర్ అయ్యాయి.
ఇదిలా ఉంటే..స్థానిక ఎన్నికల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఎస్‌ఈసీ ఆదేశించింది. ఈ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సిబ్బంది, తదితర అంశాలకు సంబంధించి నిర్దేశిత ఫార్మాట్లలో వివరాలు పంపించాలని సూచించింది. సెపె్టంబర్ 30 లోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కలెక్టర్లు సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.
జిల్లాల్లోని పరిస్థితులు, శాంతిభద్రతల సమస్యలు, తదితరాల ప్రాతిపదికన రెండు లేదా మూడుదశల్లో ఎన్నికల నిర్వహణపై అవపరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. ఒక మండలంలోని అన్ని పంచాయతీలకు ఒకేదశలో ఎన్నికల జరిపేలా చూడాలని పేర్కొంది. కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కొత్తగా పోలింగ్ స్టేషన్లజాబితాలను సిద్ధం చేసి పంపించాలని ఎస్‌ఈసీ సూచించింది.