డబ్బుల్లేవు.. కొత్త పథకాలెట్టా? | Discussion within government circles on Telangana financial situation | Sakshi
Sakshi News home page

డబ్బుల్లేవు.. కొత్త పథకాలెట్టా?

Jun 22 2025 1:04 AM | Updated on Jun 22 2025 1:04 AM

Discussion within government circles on Telangana financial situation

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ 

ప్రస్తుత పథకాల అమలుకే నానా కష్టాలు..

రూపాయి రూపాయి పోగేయాల్సి వస్తున్న వైనం  

కొత్త పథకాలు ఇప్పట్లో సాధ్యం కానట్టే అంటున్న ఆర్థిక శాఖ వర్గాలు

నిధుల లేమితోనే రాజీవ్‌ యువ వికాసం నిలుపుదల? 

పింఛన్ల పెంపులాంటి నిర్ణయాలకూ వెనుకంజ అందుకే.. 

ప్రతినెలా ఖజానాకు వచ్చే రాబడిని మించి ఖర్చవుతున్న వైనం

రాబడి రూ. 16,473 కోట్లు.. ఖర్చు రూ. 17 వేల కోట్లకు పైనే.. 

భూముల అమ్మకాలు జరిగితేనే అదనపు ఆదాయం! 

‘నియోపొలిస్‌’, హెచ్‌ఎండీఏ భూములపై సర్కారు ఆశలు

18 నెలల్లో రూ. 15వేల కోట్లు రాబట్టుకునే యోచన

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకే నానా కష్టాలు పడుతూ డబ్బులు సమకూర్చుకుంటున్న నేపథ్యంలో..ఇక కొత్త సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఆర్థిక కటకట నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం అమలు నిలిపివేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ప్రతి నెలా ఖజానాకు వస్తున్న ఆదాయంతో అనివార్యంగా చేయాల్సిన ఖర్చుల సర్దుబాటు మాత్రమే జరుగుతోందని, ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆసరా పింఛన్లను పెంచి ఎన్నికలకు వెళ్లాలనుకున్నా సాధ్యం కాలేదని, రైతు భరోసా నిధులు జమ చేసేందుకు మాత్రమే వెసులుబాటు దొరికిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయం కావాలంటే భూముల అమ్మకమే శరణ్యమని స్పష్టం చేస్తున్నాయి. 

ఆదాయం అంతంత మాత్రమే.. 
ఖజానా లెక్కలు పరిశీలిస్తే.. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి నెలా ప్రభుత్వ సొంత రాబడులు రూ.12 వేల కోట్లకు మించడం లేదు. గత రెండేళ్ల గణాంకాలు పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతోంది. తాజాగా కాగ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 ఏప్రిల్‌ నెలలో రూ.10,916 కోట్లు మాత్రమే పన్ను ఆదాయం వచ్చింది. 

ఇందులో జీఎస్టీ కింద రూ.4 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,126 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,700 కోట్లు, ఎక్సైజ్‌ ద్వారా రూ.1,300 కోట్లు, కేంద్ర పన్నుల రూపంలో రూ.1,100 కోట్లు వచ్చాయి. వీటితో పాటు అప్పులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలిపినా మొత్తం రాబడులు రూ.16,473 కోట్లు మాత్రమే.   

ప్రతి నెలా ఖర్చు ఇలా.. 
ఖర్చుల విషయానికి వస్తే ప్రతి నెలా సగటున రూ.6 వేల కోట్ల వరకు రెవెన్యూ పద్దు కింద ఖర్చు చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పాటు రూ.2 వేల కోట్ల వరకు అప్పులకు వడ్డీల కింద, దాదాపు రూ.4 వేల కోట్లు (తాజాగా ప్రకటించిన డీఏతో కలిపి) ఉద్యోగులకు వేతనాల కింద, రూ.1,500 కోట్లు పింఛన్ల కింద, రూ.2,500 కోట్ల వరకు సబ్సిడీల కింద, రూ.1000–1500 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయాల్సి వస్తోంది. 

ఇవన్నీ అనివార్యంగా చెల్లించాల్సినవే. ఇవన్నీ కలిపి రూ.17 వేల కోట్లు దాటుతున్నాయి. అయితే ప్రభుత్వ రాబడులు (అప్పులతో కలిపి) ఇంతకంటే తక్కువే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొంచెం అటుఇటుగా ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇచ్చేటట్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండటం గమనార్హం. 

కాగా రూపాయి అదనంగా ఖర్చు పెట్టాలన్నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు కడుపు కట్టుకోవాల్సిందేనని, ఎప్పటికప్పుడు సర్దుబాటుకు మాత్రమే నిధులు సరిపోతున్నాయని, ఏదైనా పథకానికి డబ్బులు కావాలంటే రూపాయి రూపాయి పోగేయాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.  

హెచ్‌ఎండీఏపై ఆశలు..‘నియోపొలిస్‌’పై కన్ను 
ప్రస్తుత పరిస్థితుల్లో భూముల అమ్మకాల ద్వారా మాత్రమే అదనపు ఆదాయం వస్తుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుడే లోటు రూ.9 వేల కోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల ద్వారా రూ.20 వేల కోట్లు సమకూర్చుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో ఇక, హెచ్‌ఎండీఏ మీదనే ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. 

ముఖ్యంగా కోకాపేట్‌ నియోపొలిస్‌ భూముల అమ్మకాలను త్వరలోనే తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఐదు ప్రాంతాల్లో భూముల అమ్మకాలకు అవకాశాలున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు 18 హెచ్‌ఎండీఏ లేఅవుట్లలోని 2,414 ప్లాట్లు, ఉప్పల్‌ భగాయత్, తుర్కయంజాల్, ఇన్ముల్‌ నర్వలతో పాటు లేమూరు, కుర్మాల్‌గూడ, బాచుపల్లి, మేడిపల్లి, మోకిల, ప్రతాప సింగారం, బహుదూర్‌పల్లి, పెద్ద కంజర్ల తదితర ప్రాంతాల్లోని ఓపెన్‌ ప్లాట్లు అమ్మడానికి కూడా సర్కారు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

మొత్తం మీద 18 నెలల కాలంలో కనీసం రూ.12 వేల కోట్లను హెచ్‌ఎండీఏ భూముల అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలని, నియోపోలిస్‌ భూముల అమ్మకాల ద్వారా మరో రూ.3 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం.  

ఎన్నికల సమయంలో అలా... 
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నట్లు చెప్పి పలు పథకాలను ప్రకటించిన కాంగ్రెస్‌ పెద్దలు.. ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చేసరికి ఆదాయం పెరిగితే తప్ప అమలు చేయడం సాధ్యం కాదని, అప్పుల కిందే నెలకు రూ.6 వేల కోట్లు చెల్లించాల్సి రావడం వల్ల సంక్షేమ పథకాలకు నిధులు చాలడం లేదని అంటుండంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పెన్షన్ల పెంపు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏడాదిన్నర అయినా అమలు కాకపోగా... రైతుభరోసా కింద ఎకరాకు ఏటా ఇస్తామన్న మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదిండాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. అది కూడా సక్రమంగా చెల్లించలేదని ఆరోపిస్తున్నాయి. 

అలాగే ఉద్యోగులకు ఐదు డీఏలు చెల్లించాల్సి ఉండగా, రెండింటికి అమోదం తెలిపి.. ఒక డీఏ ఇప్పుడు చెల్లిస్తామని, మరో డీఏ ఆరునెలల తరవాత చెల్లిస్తామని చెప్పడం కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇక వేతన సవరణ ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదని ఉద్యోగులు వాపోతుండగా.. ఆదాయం పెరిగితే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

పెరుగుతున్న బడ్జెట్‌ అంతరం 
ప్రస్తుత (2025–26) ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే సగటున నెలకు రూ.25 వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ మొదటి రెండు నెలల ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే అది రూ.16,500 కోట్లు దాటలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, వాస్తవ రాబడులకు మధ్య దాదాపు రూ.8,500 కోట్ల మేర తేడా వస్తోందన్న మాట. 

గత అర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది ఎక్కువే. 2024–25లో ప్రతిపాదించిన బడ్జెట్‌ ప్రకారం ప్రతినెలా సగటున రూ 23,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలి. కానీ సగటున రూ.17 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకే రాబడులు వచ్చాయి. అంటే ప్రతినెలా సుమారు రూ.6 వేల కోట్లు తక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ తేడా ఏకంగా రూ.8,500 కోట్లకు చేరడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement