కొత్త వేరియెంట్‌ వస్తేనే..!

Delta Variant Cases May Increase In November - Sakshi

కొత్త వేవ్‌ వచ్చే అవకాశం 

నవంబర్‌ దాకా జాగ్రత్తగా ఉండాల్సిందే! 

ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియెంటే ప్రబలంగా ఉంది 

ఆఫ్రికాలో వ్యాక్సినేషన్‌ 3 శాతమే ఉంది 

అందువల్ల అక్కడ కొత్త వేరియెంట్లు పుట్టొచ్చు 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కోవిడ్‌ మహమ్మారి తీవ్రత తగ్గినట్టు కనబడుతోంది. కేసులు తక్కువగా నమోదుకావడంతోపాటు పాజిటివిటీ రేట్, యాక్టివ్‌ కేసులు కూడా తక్కువగానే ఉంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో థర్డ్‌వేవ్‌ లేదా మరో కొత్త వేవ్‌ వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే గత నవంబర్‌లో డెల్టా వేరియెంట్‌ ఆనవాళ్లు కనిపించి కేసుల పెరుగుదల మొదలై ఫిబ్రవరి కల్లా సెకండ్‌వేవ్‌ తీవ్రస్థాయికి చేరి మొత్తం దేశాన్నే అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.

అందువల్ల కొత్త వేరియెంట్‌ పుట్టడానికి రెండు నుంచి మూడు నెలలు పడుతున్నందున వచ్చే నవంబర్‌ వరకు వ్యాక్సినేషన్‌ వేగం పెంచడంతోపాటు కొత్త వేరియెంట్‌ ఉద్భవించడానికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 15 నుంచి సెప్టెంబర్‌ 15 దాకా 187 దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్వహించిన అధ్యయనంలో డెల్టా వేరియెంటే ఉనికిలో ఉన్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా వేవ్‌గా రావాలంటే డెల్టాకు మించిన వేరియెంట్‌ పుడితేనే ప్రమాదకరంగా మారుతుందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. 

ఆఫ్రికా దేశాల్లో 3 శాతమే వ్యాక్సినేషన్‌... 
ఇతరదేశాల్లో థర్డ్‌వేవ్‌కు కారణమైన డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ నిర్వీర్యమైంది. అలాగే, వేరియెంట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌గా ప్రభావితం చేస్తాయని భావించిన థీటా, అయోటా, కప్పా, జేటా వేరియెంట్లను కూడా డౌన్‌గ్రేడ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒరిజనల్‌ డెల్టా వేరియెంట్‌ కలిపి 39 సబ్‌క్లేట్స్‌ (ఆయా ప్రాంతాల్లో వ్యాప్తిని బట్టి) ఉండగా, భారత్‌లో 21 సబ్‌క్లేట్స్‌గా మారి డెల్టా వైరస్‌ వ్యాప్తిలో ఉంది.

ఆఫ్రికా దేశాల్లో కేవలం 3 శాతమే వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల అక్కడ కొత్త వేరియెంట్‌ పుట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అక్కడ కొత్త వేరియెంట్‌ పుట్టి కొత్త వేవ్‌గా ప్రభావం చూపొచ్చునని, అప్పటి వరకు స్పైక్స్‌ రూపంలోనే రావొచ్చుని అంటున్నారు. 

ఎవరికి వారు పరిమితులకు లోబడి ఉంటేనే.. 
ఇప్పుడు వైరస్‌ తీవ్రత, వ్యాప్తి పెరగలేదు. అయినా ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే శ్రేయస్కరం. ప్రస్తుతం మనకు ‘మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ కాక్‌టెయిల్‌ డ్రగ్‌’ అందుబాటులో ఉండటం మేలు చేస్తోంది. ఈ ఇంజెక్షన్‌తో నాలుగు రోజుల్లోనే కోవిడ్‌ నెగెటివ్‌ వచ్చేస్తోంది. అదీగాక పోషకాహారం, తగిన విశ్రాంతి తీసుకుంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారిన పడకుండా రక్షణ పొందొచ్చు.

సురక్షిత చర్యలు పాటిస్తూ పండగలు చేసుకున్నా, హాలిడే ట్రిప్‌లు తిరిగినా ఏమీ కాదు. ఎవరికి వారు పరిమితులకు లోబడి వ్యవహరించకపోతే మళ్లీ కరోనా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త వేరియెంట్లు ఏర్పడకుండా. ప్రమాదకరమైన మ్యుటేషన్లు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బా ధ్యత మనందరిపై ఉంది.
–డా.ప్రభుకుమార్‌ చల్లగాలి, జనరల్‌ ఫిజీషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్‌  

డెల్టాను డామినేట్‌ చేస్తేనే... 
దేశంలో డెల్టా వేరియెంట్‌ ఒక్కటే ప్రబలంగా ఉంది. మనదగ్గర 70 నుంచి 80 శాతం మంది కనీసం ఒక్క డోస్‌ అయినా టీకా తీసుకున్నారు. గతంలో కరోనా వ చ్చి పోయిన వారు, టీకా తీసుకున్న వారు కలిపి చాలామందిలోనే యాంటీబాడీస్‌ ఏర్పడ్డాయి. కొత్త వేవ్‌ వచ్చినా వారిలో తీవ్రత తక్కువగానే ఉండే అవకాశముంది. అదీగాక గతంతో పోల్చితే ఎలాంటి పరిస్థితి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్థంగా ఉన్నాం. మహారాష్ట్ర, ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తక్కువగానే ఉంటున్నాయి. డెల్టా వేరియెంట్‌ను డామినేట్‌ చేసే కొత్త వేరియెంట్‌ వచ్చే వరకు ఇంకొక వేవ్‌ వచ్చే అవకాశాలు ఇప్పటికైతే లేవు. 
–డా.కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి, వైద్యకళాశాల  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top