చలో ఆఫీస్‌..! .. డెలాయిట్‌ సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి

Deloitte Survey: Majority Of Employees Intrested Return To The Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసుల తగ్గుదలతో అంతటా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలో దాదాపు 83 కోట్ల మంది టీకాలు (వారిలో 61 కోట్ల మంది మొదటి డోస్‌) తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారికి ముందటి స్థాయిలో కాకపోయినా ఆఫీసులకు వెళ్లేందుకు ఎక్కువ మందే సిద్ధమౌతున్నారు. పనిప్రదేశాలకు వెళ్లడం సురక్షితమేనని 84 శాతం మంది చెబుతున్నారు.

‘గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ ద కన్జ్యూమర్‌ ట్రాకర్‌’పేరిట డెలాయిట్‌ టచ్‌ తోహ్‌మత్సు ఇండియా నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌తోసహా 18 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. కరోనా భయం తగ్గిన నేపథ్యంలో విమాన ప్రయాణాలకు, విదేశీ పర్యటనలకు, ఇతర ప్రాంతాల్లోని హోటళ్లలో ఉండేందుకు సై అంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. వివిధ రంగాల ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు వెళ్లడం మొదలుకావడం, వస్తువుల కొనుగోళ్లకూ వినియోగదారులు సిద్ధం కావడం వల్ల భారత ఆర్థికరంగం కోలుకునేందుకు అవకాశముందని నిపుణులు అంటున్నారు.  

అన్నీ మళ్లీ సాధారణస్థితికి రావాలి 
దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని వ్యవస్థలు మునుపటిలా పాలుపంచుకోవాల్సిందే. అధికశాతం మంది కనీసం ఒక్క డోస్‌ అయినా తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నీ మళ్లీ సాధారణస్థితికి చేరుకోవాల్సిన అవసరముంది. అన్ని రంగాలు, వర్గాల వారు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఆఫీసులకు వెళ్లడం మొదలైతే ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో ఆర్థికరంగంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది.

అన్ని రకాల వ్యాపార, వాణిజ్యసంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులను వంద శాతం ఆఫీసులకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుని వచ్చే కొన్నేళ్లపాటు కరోనాతో సహజీవనం చేసేందుకు అందరూ సిద్ధం కావాల్సిందే.  

– డాక్టర్‌.బి. అపర్ణరెడ్డి, హెచ్‌ఆర్‌ నిపుణురాలు

చదవండి:    కోవిషీల్డ్‌ ఓకే.. సర్టీఫికెట్‌తోనే సమస్య

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top