కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలి | Contract Employees Must Be Paid Minimum Wages: Kunamneni Sambasiva Rao | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలి

Mar 27 2026 3:47 AM | Updated on Mar 27 2026 11:57 AM

Contract Employees Must Be Paid Minimum Wages: Kunamneni Sambasiva Rao

మహాధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూనంనేని

కవాడిగూడ: గత 20 ఏళ్లుగా కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులకు నామమాత్రపు వేతనాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, కేజీబీవీ, యుఆర్‌ఎస్‌ సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా మహాధర్నా చేపట్టారు.

ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొ.డాక్టర్, కె. నాగేశ్వర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా శాసన సభలో తనవంతు పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్‌ మాట్లాడుతూ కేజీబీవీలలో అనాథలు, పాక్షిక అనాథ బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని, వీధి బాలలు పునరావాసానికి అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు విశేషంగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

విద్యా గణాంకాల సేకరణ, ప్రాథమిక పాఠశాలలకు అకడమిక్‌ సహకారం అందించడానికి సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు కృషి చేస్తున్నారని, వీరందరికి కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ నాయకురాలు ఎం.సంయుక్త మాట్లాడుతూ సెలవుల విషయంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, వివక్ష చూపడం సమంజసం కాదన్నారు.

అనంతరం టిఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావరవి , ప్రధాన కార్యదర్శి వెంకట్‌లు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు గడిచిపోయినా కేజీబీవీ యుఆర్‌ఎస్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి బి.మధు, టీఎస్‌యుటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement