కాంగ్రెస్‌లో ‘పని విభజన’

Congress party Work division for winning elections in Telangana - Sakshi

పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు కీలక బాధ్యతలు 

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ.. పనిచేయలేని నేతలు తప్పుకోవాలని సూచన 

సమావేశాలకు గైర్హాజరయ్యే నేతలకు షోకాజ్‌ నోటీసులు 

గాంధీభవన్‌లో ఠాక్రే, రేవంత్, ఏఐసీసీ కార్యదర్శుల కీలక భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పని విభజన చేసుకుంటోంది. అందులో భాగంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు కీలక బాధ్యతలు అప్పజెప్పనుంది. ఇప్పటికే కొందరు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పని బాధ్యతలు ఇవ్వగా, అందులో క్రియాశీలంగా లేని వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు మరికొందరికి కొత్తగా బాధ్యతలు ఇవ్వనుంది.

అనుబంధ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు జిల్లాల్లో పార్టీ కేడర్‌ను కదిలించే కీలక బాధ్యతలు, కార్యాచరణ అప్పగిస్తామని, ఈ ఎనిమిది నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో అధికారం దక్కేలా కృషి చేయాలని పార్టీ నేతలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే శనివారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో భేటీ అయ్యారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌జావెద్, రోహిత్‌చౌదరిలతో పాటు చామల కిరణ్‌రెడ్డి, నేరెళ్ల శారద, ఎం.ఎ.ఫయీమ్, గౌరీశంకర్, వినోద్‌కుమార్‌ తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు బాధ్యతల అప్పగింతపై చర్చించారు. పనిచేయలేని నేతలు స్వచ్ఛందంగా తప్పుకోవాలని, ఆ స్థానంలో ఇతరులకు బాధ్యతలివ్వాలని సమావేశంలో తీర్మానించారు. గత సమావేశాలకు రాని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు షోకాజ్‌నోటీసులివ్వాలని నిర్ణయించారు.  

కాంగ్రెస్‌ వాదన బలంగా వినిపించాలి 
రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ వాదనను అటు ప్రసార మాధ్యమాల్లోనూ, ఇటు సోషల్‌మీడియాలోనూ బలంగా వినిపించాలని ఠాక్రే, రేవంత్‌రెడ్డిలు సూచించారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర సోషల్‌మీడియా సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

పార్టీ చేపట్టిన కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ఫోకస్‌ పెట్టాలని కోరారు. అనంతరం రిజర్వుడు నియోజకవర్గాల్లో లీడర్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఏర్పాటు చేసిన ఎల్‌డీఎంఆర్‌సీ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో రిజర్వుడు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే ప్రణాళికపై కాంగ్రెస్‌ ముఖ్య నేతలు చర్చించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top