కాంగ్రెస్‌లో మరో ‘యాత్ర’!

Congress Party Leader Batti Vikramarka Padayatra - Sakshi

మార్చి తొలివారంలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రకు సిద్ధమవుతున్న సీఎల్పీ నేత భట్టి

బాసరలో ప్రారంభం.. ఖమ్మంలో ముగింపు.. 35 నియోజకవర్గాల్లో కొనసాగింపు!

షెడ్యూల్‌పై సీఎల్పీ కార్యాలయంలో భట్టి, ఏలేటి, ప్రేమ్‌సాగర్‌రావు కసరత్తు

రాయ్‌పూర్‌ ప్లీనరీ తర్వాత ప్రారంభించే యోచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో పాదయాత్రకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్ర సాగుతుండగా.. వచ్చే నెల తొలివారంలో అదే పేరుతో యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి మొదలుపెట్టి.. రోజుకో నియోజకవర్గం చొప్పున మొత్తం 35 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో భట్టి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు భేటీ అయి యాత్ర షెడ్యూల్‌పై కసరత్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల మీదుగా యాత్ర కొనసాగించి ఖమ్మంలో ముగింపు సభ నిర్వహించాలని  నిర్ణయించారు.

ఈ షెడ్యూల్‌ మేరకు నియోజకవర్గాల నేతలకు సమాచారం అందించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరగనున్న ఏఐసీసీ ప్లీనరీ తర్వాత ఈ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు.

బాసర టు ఖమ్మం
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెండు నెలల వ్యవధిలో హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రలను పూర్తి చేయాలని ఏఐసీసీ ఇంతకుముందే ఆదేశించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈనెల ఆరో తేదీన ములుగు నియోజకవర్గం నుంచి యాత్రను ప్రారంభించారు. దీనిలో తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నేతలు పాల్గొని తామంతా కలిసే ఉన్నామని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు.

అయితే అసెంబ్లీ సమావేశాల కారణంగా రేవంత్‌ యాత్రలో సీఎల్పీ నేత భట్టి తొలుత పాల్గొనలేకపోయారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తాను కూడా రాష్ట్రంలో మరోవైపు నుంచి యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రలను రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని.. అందువల్ల ఓ వైపు రేవంత్, మరోవైపు భట్టి ఆధ్వర్యంలో యాత్రలు చేయడం ద్వారా త్వరగా ముగించవచ్చన్నదే పార్టీ యోచన అని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో వివాదమేమీ లేదని అంటున్నాయి. భట్టి ఆధ్వర్యంలో నిర్వహించే యాత్రలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, శ్రీధర్‌బాబు, వి.హనుమంతరావు వంటి ముఖ్య నేతలతోపాటు రేవంత్‌రెడ్డి కూడా పాల్గొంటారని చెప్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top