హైబ్రిడ్‌గా సీట్లు పెంచాలి | CM Revanth Reddy Says seats should be increased In Lok Sabha | Sakshi
Sakshi News home page

హైబ్రిడ్‌గా సీట్లు పెంచాలి

Apr 14 2026 1:22 AM | Updated on Apr 14 2026 1:22 AM

CM Revanth Reddy Says seats should be increased In Lok Sabha

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీలు రఘురామ్‌రెడ్డి, చామల, వేం నరేందర్‌రెడ్డి

జనాభా దామాషా ప్రకారం 50%, జీఎస్‌డీపీ ప్రాతిపదికన మరో 50% సీట్లు పెంచాలి: సీఎం రేవంత్‌

పెంచే 272 లోక్‌సభ సీట్లలో 136 జనాభా లెక్కన, మరో 136 జీఎస్‌డీపీ ప్రకారం రాష్ట్రాలకు కేటాయించాలి

ప్రధాని ప్రతిపాదన వల్ల దక్షిణాది, ఉత్తరాది మధ్య భారీ అంతరం

కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణ సాధించారు.. ఇప్పుడు పునర్విభజనపైనా పోరాడతారు

ఈ పోరాటంలో దక్షిణాదితోపాటు చిన్న రాష్ట్రాలనూ ఏకం చేస్తాం

దామాషా ప్రకారం సీట్లు పెరిగితే బండి, కిషన్‌రెడ్డి బంట్రోతులుగా మిగిలిపోతారు

ముందు మహిళా బిల్లు ఆమోదించాలి.. ఆ తర్వాతే సీట్ల పెంపు, పునర్విభజనపై విస్తృత చర్చ జరపాలి

సాక్షి, హైదరాబాద్‌: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం హడావుడి చేస్తోందని.. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన రెండు వేర్వేరనే విషయాన్ని మరుగున పెట్టి, రెండింటినీ జనాభా లెక్కల తర్వాత ఆమోదింప చేసుకోవాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని.. ప్రపంచంలోనే భారత్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన పార్టీ కాంగ్రెస్‌ అని రేవంత్‌ గుర్తుచేశారు. 

నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక నిర్మాణం, రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకొని సీట్ల పెంపు జరగాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం ‘హైబ్రిడ్‌ మోడల్‌’ అవసరమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పెంచబోయే 272 లోక్‌సభ స్థానాల్లో 136 సీట్లను జనాభా ప్రాతిపదికన మరో 136 సీట్లను జీఎస్‌డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ఎంపీలతో కలిసి సచివాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

హైబ్రిడ్‌ విధానంతో సమన్యాయానికి అవకాశం
‘దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి జీఎస్‌డీపీలో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించడం తగదు. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే దానికి మేం వ్యతిరేకం. అందుకే హైబ్రిడ్‌ మోడల్‌ ప్రతిపాదిస్తున్నాం. లోక్‌సభలో ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం మేర పెంచితే సీట్లు 816కు చేరుతాయి. పెరిగే 272 సీట్లలో 136 దామాషా (ప్రొరాటా) ప్రకారం పెంచుకొని మరో 136 సీట్లను ఆర్థికంగా దేశానికి అందిస్తున్న సేవల ఆధారంగా పెంచాలి. ఈ సీట్ల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో చర్చించాలి. పార్లమెంటులో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 2027 మార్చి 31లోగా జనగణన, 2028 మార్చిలోగా పునర్విభజన పూర్తి చేసి 2029లో పెరిగిన సీట్లతో ఎన్నికలకు వెళ్లవచ్చు’అని రేవంత్‌ సూచించారు.

మహిళా బిల్లు, పునర్విభజన బిల్లును కలపడం రాజకీయ కుట్ర
‘నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఒకటిగా చూపిస్తూ కేంద్రం హడావుడి చేస్తోంది. ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదు. వేర్వేరుగా చర్చించి అమలు చేయాలి. మహిళల రిజర్వేషన్‌ బిల్లు విషయంలో ఆలస్యం చేయడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. దేశంలో ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశాలు కల్పించింది కాంగ్రెస్‌. రాజీవ్‌ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు–2013లో రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ బీజేపీ సహకరించకపోవడంతో లోక్‌సభలో నిలిచిపోయింది. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. 2024 ఎన్నికల్లోనే 33% రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే 181 మహిళలు లోక్‌సభలో ఉండేవారు. 2026 జనాభా లెక్కల తర్వాత అంటే మహిళల హక్కులను వాయిదా వేయడమే. నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలి’అని సీఎం సూచించారు.

జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుతో దక్షిణానికి అన్యాయం
‘దేశంలో 1970 ప్రాంతంలో కుటుంబ నియంత్రణ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేశాయి. అందుకే జనాభా తగ్గింది. ఉత్తరాదిలో నియంత్రణ లేకపోవడంతో జనాభా పెరిగింది. ఇప్పుడు జనాభా ఆధారంగా సీట్లు పెంచితేం మంచి పనిచేసిన రాష్ట్రాలను శిక్షించినట్లే అవుతుంది. ఇందిరాగాంధీ ఈ విషయాన్ని గమనించి లోక్‌సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్ల వరకు సీట్ల పెంపును ఇందిరాగాంధీ నిషేధించారు. 2001లో వాజ్‌పేయి పునర్విభజన బిల్లుపై చట్ట సవరణ చేశారు. చట్టపరంగా సీట్ల పెంపుపై నిషేధం విధించారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజనకు ఒప్పుకోబోమని దక్షణాది రాష్ట్రాలు నిరసన తెలపడంతోపాటు ప్రధానికి లేఖ రాశాయి. 

దాంతో దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచుతామంటున్నారు. 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమే. కానీ 50 శాతం పెంచితే 90 సీట్లకు అంతరం పెరుగుతుంది. తెలంగాణకు, యూపీకి 94 సీట్ల అంతరం పెరుగుతుంది. దక్షణాదిలో 130 సీట్లు ఉన్నాయి. 50 శాతం పెరిగితే 195 అవుతాయి. 413 సీట్లున్న ఉత్తరాదిలో 621 సీట్లు అవుతాయి. దక్షణాది, ఉత్తరాద మధ్య అంతరం 412 సీట్ల నుంచి 620 సీట్లకు పెరుగుతుంది. దీనివల్ల ఒక్క తెలంగాణకే కాదు... దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతోపాటు గోవా, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు కూడా అన్యాయమే జరుగుతుంది. తద్వారా దక్షిణాది, ఉత్తరాది మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుంది. ఇది దేశ సమతౌల్యానికి ప్రమాదకరం’అని సీఎం రేవంత్‌ హెచ్చరించారు.

బండి సంజయ్, కిషన్‌రెడ్డి మోదీ ఇంటి ముందు బంట్రోత్తులుగానే..
‘50 శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ప్రధాని మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుంది. వాళ్ల అవసరం ఇకపై ఉండదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిచే ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మోదీ గుజరాత్‌ వదిలి యూపీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారంటే అక్కడ 80 సీట్లు ఉన్నాయి కాబట్టి. అందుకే హైబ్రిడ్‌ విధానంలో దేశానికి ఆర్థిక పరిపుష్టిని అందిస్తున్న రాష్ట్రాలకు 50 శాతం కేటాయించాలి. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. 50 శాతం మెరిట్, 50 శాతం రిజర్వేషన్‌ అని. దానినే కేంద్రం ఉపయోగించాలి’అని సీఎం సూచించారు.

మహిళలకు బీజేపీ అన్యాయం చేసింది
‘బీజేపీ 1980 ఏప్రిల్‌ 6న ఏర్పాటైంది. ఇప్పటివరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగితే ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క మహిళను కూడా నియమించలేదు. జనరల్‌ సెక్రటరీ ఆర్గనైజేషన్‌ పదవి కూడా ఇవ్వలేదు. దీన్నిబట్టే బీజేపీకి మహిళలపై గౌరవం, చిత్తశుద్ది ఎంత ఉందో అర్థమవుతుంది. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్‌ మాట్లాడాలి. బండి సంజయ్‌ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకం. మా ఎంపీలు తెలంగాణను సాధించారు. ఇప్పుడు పునర్విభజనపైనా పోరాడుతారు. దక్షణాది రాష్ట్రాలతోపాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్లమెంటులో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తాం. అన్ని దక్షణాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, పంజాబ్‌ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపై లేఖ రాస్తా’అని సీఎం రేవంత్‌ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement