
కేంద్రమంత్రి గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎంపీ చామల
ఫ్యూచర్ సిటీ–అమరావతి–బందరు
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుమతి ఇవ్వండి
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కూడా...
శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి వినతులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రహదారి నెట్‌వర్క్ విస్తరణ, విద్యాభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ను మంగళవారం ఆయన వేర్వేరుగా కలిసి ఈ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.
హైదరాబాద్ సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా బందరు ఓడరేవు వరకు 12 వరుసల రహదారి నిర్మించాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ ప్రతిపాదిత మార్గంలో 118 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంటుందని సీఎం వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను వేగవంతం చేయాలని కోరారు.
శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి
హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్–శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. దీనితో పాటు రావిర్యాల–ఆమన్‌గల్–మన్ననూర్ మార్గాన్ని నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా, రద్దీ అధికంగా ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్–మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని కోరారు.
సీఎం విజ్ఞప్తులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్‌ఐఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.868 కోట్ల పనులకు వారంలోగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. బందరు పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై ఈ నెల 22న హైదరాబాద్‌లో ఎన్‌హెచ్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
రూ.30 వేల కోట్లతో విద్యా ప్రణాళిక
తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రేవంత్‌రెడ్డి వివరించారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఆమెను కలిసి.. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి ఉద్దేశించిన రూ.30 వేల కోట్ల ప్రణాళికకు అనుమతులివ్వాలని కోరారు. 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఒక్కో పాఠశాలలో 2,560 మంది చొప్పున సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. ఈ స్కూళ్లకు రూ.21 వేల కోట్లు, ఇతర ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. నిధుల సమీకరణకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్పొరేషన్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కోరారు.
గత ప్రభుత్వం అధిక వడ్డీలకు చేసిన అప్పుల రీస్ట్రక్చర్‌కు అనుమతించాలని విన్నవించారు. సీఎం విజ్ఞప్తులపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సీఎం వెంట ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.