
సోమవారం ఉస్మానియా సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
విశ్వవిద్యాలయం పూర్వ వైభవానికి కృషి చేద్దాం
ఓయూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు ఇంజనీర్ల కమిటీ
వర్సిటీకి ఏమేమి కావాలో ప్రణాళిక తయారు చేయండి
డిసెంబర్‌లో ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభ పెట్టండి
అక్కడికక్కడే అన్ని సమస్యల పరిష్కారానికి జీవోలు జారీ చేయిస్తా
ఓయూ, తెలంగాణ మధ్య విడదీయలేని సంబంధం ఉందన్న సీఎం
15 రోజుల్లో కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తామని వెల్లడి
రెండు హాస్టళ్లు ప్రారంభించిన సీఎం, మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ వైభవానికి కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీల మాదిరి తీర్చిదిద్దుదామని అన్నారు. ఓయూను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఓయూకు ఎంత ఇచ్చినా తక్కువేనంటూ, ఏమేమి కావాలో ప్రణాళికను తయారు చేయాలని సూచించారు.
డిసెంబర్‌లో ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభ ఏర్పాటు చేస్తే వస్తానని, అధ్యాపక ఉద్యోగాల సమస్యతో పాటు అన్ని సమస్యల పరిష్కారానికి అక్కడే వెంటనే జీవోలు జారీ చేయిస్తానని చెప్పారు. సోమవారం యూనివర్సిటీ క్యాంపస్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన పీజీ విద్యార్థుల దుందుభి, ఇంజనీరింగ్ విద్యార్థుల భీమా హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించనున్న మరో రెండు హాస్టల్ భవనాలకు, రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించే డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూంలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో వీసీ ప్రొఫెసర్ కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ‘తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై ప్రసంగించారు. ఓయూ విశిష్టతను, ఉద్యమాల చరిత్రను వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాంత్‌రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితర విద్యార్థులను స్మరించుకున్నారు.
ఓయూ అంటేనే తెలంగాణ
‘ఓయూ అంటేనే తెలంగాణ. రెండింటి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. 1935లో వందేమాతరం, 1938లో సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ఓయూ విద్యార్థుల పాత్ర కీలకం. మలి దశ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే విజయం సాధించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్, మర్రి చెన్నారెడ్డి, జార్జిరెడ్డి, జైపాల్‌రెడ్డి, గద్దర్ తదితరులను అందించిన ఘనత ఓయూది. చదువుతో పాటు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు విద్యార్థులు ఎదిరించి పోరాడారు. యువతే దేశ సంపద. 21 ఏళ్లకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవుతున్నారు. యువకులు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలు కావాలి..’ అని సీఎం ఆకాంక్షించారు.
నేనూ మీలో ఒకడినే..
ఓయూలో 60 ఏళ్లకు పైబడిన పాత భవనాలు ఉన్నాయని, కొత్త భవనాల నిర్మాణం, 2,500 మందికి సరిపడ కన్వెన్షన్ హాల్, ఇతర అవసరాలకు నిధులు మంజురు చేయాలని వీసీ కుమార్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ..ఇంజినీర్ల కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘ప్రజలకు పంచేందుకు భూములు లేవు.. ఇచ్చేందుకు డబ్బులు లేవు. నాణ్యమైన విద్యను మాత్రమే ఇవ్వగలం. ఈ సంవత్సరం విద్యకు రూ.40 వేల కోట్లు వెచ్చించనున్నాం. విద్యార్థులు బాగా చదువుకోవాలి.
ఓయూలోనే చదివిన దయాకర్ ఎమ్మెల్సీ అయ్యాడు, బాలలక్ష్మీ, చారకొండ వెంకటేష్ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. నేనూ మీలో ఒకడినే. తెలంగాణలోనే పుట్టా..ఇక్కడే పెరిగా. ఇక్కడే చదువుకున్నా. జెడ్పీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అయ్యా. మీరు చేస్తేనే సీఎం కూడా అయ్యా. మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అపోహలకు, అబద్ధాల సంఘాలకు నమ్మి మోసపోకండి. డిసెంబర్‌లో ఒక పోలీసు కూడా లేకుండా ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభను ఏర్పాటు చేయండి. నా రాకను అడ్డుకునేవారు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతా..’ అని రేవంత్ పేర్కొన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌లకు అభివృద్ధి కన్పించడం లేదు..
‘పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ కోసం పోరాడిన ప్రొ.కోదండరాం ఎమ్మెల్సీ పదవిని బీఆర్‌ఎస్ నేతలు సుప్రీంకోర్డు వరకు వెళ్లి రద్దు చేయించి పైశాచిక ఆనందం పొందారు. ఆయన్ను 15 రోజుల్లో తిరిగి ఎమ్మెల్సీని చేస్తాం. హెచ్‌సీయూ భూముల్లో ఏఐ టెక్నాలజీతో ఏనుగులు, సింహాలు పెట్టారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేవు.. మానవ మృగాలే ఉన్నాయి.
తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినా కేసీఆర్, కేటీఆర్‌కు కనిపించడం లేదు. నాపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అంతానికి ఈగల్ ఫోర్సును, అక్రమ కట్టడాల నిర్మూలనకు హైడ్రాను ఏర్పాటు చేస్తే బీఆర్‌ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓయూ భూములను ప్లాట్లు చేసి అమ్ముకుంటారు..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.
సీఎం రీసెర్చ్ ఫెలోషిప్‌లు ప్రారంభం
ఓయూలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన సీఎం రీసెర్చ్ ఫెలోషిప్‌ను, విదేశాలలో పరిశోధనలకు వెళ్లే పీజీ, పీహెచ్‌డీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫెలోషిప్‌ను సీఎం ప్రారంభించారు. విద్యార్థుల పరిశోధనలకు.. సింగరేణి కాలరీస్, ఓయూ, ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ ఆర్థిక సహకారంతో ఈ ఫెలోషిప్‌లు అందజేయనున్నట్లు తెలిపారు. నెలకు రూ.5 వేల చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కాలేజీ విద్య కమిషనర్ శ్రీదేవసేన, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్, తదితర నేతలతో పాటు పలువురు ఓయూ అధికారులు పాల్గొన్నారు.