
ఓ యువకుడికి నియామక పత్రం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం. చిత్రంలో మంత్రి ఉత్తమ్, జగ్గారెడ్డి, సీఎస్
ఈ భూ ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ఒక్కటే
నిజాం, నెహ్రూలు కట్టిన జలాశయాలు నేటికీ చెక్కు చెదరలేదు
రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా 50 వేల ఎకరాలకు కూడా నీరివ్వలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
పదేళ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా..ఉమ్మడి రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు
ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందంటూ నిలదీత
నీళ్లు నాగరికతను నేర్పుతాయి.. తెలంగాణ ప్రజలకు ఉద్యమాన్ని నేర్పాయని వ్యాఖ్య
నీటిపారుదల శాఖలో కొత్త ఏఈలు సహా 423 మందికి నియామక పత్రాలు అందజేత
సాక్షి, హైదరాబాద్: ఈ భూ ప్రపంచంలో కట్టిన మూడేళ్లకే కుప్పకూలిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజాం కాలంలో మూసీ నదిపై కట్టిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌తో పాటు జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని చెప్పారు. కానీ మూడేళ్లలోనే కాళేశ్వరం.. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని అన్నారు.
రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినా 50 వేల ఎకరాలకు కూడా నీరివ్వలేదని విమర్శించారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్లుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందిన 423 మందికి బుధవారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారికి పలు సూచనలు చేస్తూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల తీరుతెన్నులను వివరించారు.
ఓ రాజకీయ పార్టీ భావోద్వేగాన్ని వాడుకుంది
‘నీళ్లు నాగరికతను నేర్పుతాయి. తెలంగాణ ప్రజలకు నీళ్లు ఉద్యమాన్ని నేర్పాయి. నీళ్ల కోసం పరితపించి పోరాడాం. అంతటి ప్రాధాన్యత గల నీటిపారుదల శాఖలో పనిచేయడం ఉద్యోగం కాదు. భావోద్వేగం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది నీళ్లు, నిధులు నియామకాలు. ఈ మూడింటితో కూడిన భావోద్వేగాన్ని ఓ రాజకీయ పార్టీ వాడుకుని పదేళ్లు అధికారంలో కొనసాగింది. పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఉమ్మడి రాష్రంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమై పెండింగ్‌లో ఉన్న ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు.
పాలమూరు–రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఈ రూ.2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? 10 ఏళ్లు నియామకాలు జరగలేదు. మేం ఇప్పటివరకు నీటి పారుదల శాఖలో 1,161 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. లష్కర్లుగా మరో 2 వేల మందిని నియమించాం. మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత సాగునీటి పారుదలకే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఆ మూడుచోట్లా కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు
‘సాగునీటి ప్రాజెక్టులు ఎలా కట్టాలో.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదలు సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ కట్టిన ఇంజనీర్లు చూపించారు. 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని భయపడ్డా. కానీ ఆ కట్టడానికి ఏం కాలేదు. ఒక ప్రాజెక్టు ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. హెలీకాప్టర్‌లో వెళ్తూ కిందకు చూపించి మూడు బరాజ్‌లు కట్టించారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది.
ఎవరి పని వారు చేయాలి
ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. అలా చేసిన వాళ్లు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురుకాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలడానికి అధికారులే బాధ్యులన్నట్టుగా నివేదికలు వస్తున్నాయి. మీరు కట్టే ప్రాజెక్టులు భావితరాలకు ఉపయోగపడతాయి. 30 ఏళ్లు కష్టపడితే తప్ప అసిస్టెంట్ ఇంజనీర్.. ఇంజనీర్ ఇన్ చీఫ్ కాలేరని గుర్తుంచుకోవాలి. కుప్పకూలిన ప్రాజెక్టు కాళేశ్వరంను ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందిన వారు సందర్శించాలి..’ అని రేవంత్ చెప్పారు.
‘సీతారామ’ కూడా లోపభూయిష్టంగానే ఉంది
‘సీతారామ ప్రాజెక్టు కూడా లోపభూయిష్టంగానే ఉంది. 45 కిలోమీటర్ల అతి పొడవైన టన్నెల్ ప్రాజెక్టు ఎస్‌ఎల్‌బీసీ 75 శాతం ఎప్పుడో పూర్తయితే పదేళ్లలో 10 కిలోమీటర్ల పనులు పూర్తి చేయలేదు. 3.36 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును పదేళ్లు పట్టించుకోకపోతే మళ్లీ మేం అధికారంలోకి వచి్చన తరువాత పనులు ప్రారంభించాం. అయితే పదేళ్లు పనులు జరగక సొరంగం కుప్పకూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో సాగునీటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. నీటిపారుదల శాఖలో తొలిసారిగా ఉద్యోగ ఖాళీలన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిధుల కొరత వచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. తెలంగాణకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు. నిధుల కొరత వచ్చినా, ఏదోరకంగా పూర్తి చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తాం. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం అన్నారు.