సీఎం హామీల జల్లు! | Sakshi
Sakshi News home page

సీఎం హామీల జల్లు!

Published Tue, Apr 23 2024 9:25 AM

Chief Minister Revanth Reddy At A Public Meeting In Adilabad - Sakshi

 ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ఆదిలాబాద్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

జనజాతర సభ సక్సెస్‌..

‘హస్తం’ శ్రేణుల్లో జోష్‌

ఆదిలాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి హామీల జల్లు కురి పించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్‌ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ జన జాతర బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రాంగణానికి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసిన అనంతరం ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ప్రకటించారు.

బోథ్‌ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కుప్టి ప్రాజెక్ట్‌ను నిర్మించి రైతులకు సా గునీటిని అందిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిన తూర్పు ప్రాంతంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ ను నిర్మించడంతో పాటు దానికి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేరిట నామకరణం చేస్తామన్నారు. ముంపు నిర్వాసితుల అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్‌ నిర్లక్ష్యం చేసిన కడెం ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేసి దానిపై ఆధారపడ్డ ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్‌ వ్యాపారులతో మాట్లా డి తెరిపిస్తామని తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసానివ్వడం ఈ ప్రాంత వాసుల్లో ముఖ్యంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సభ సక్సెస్‌తో పార్టీ నేతల్లో హుషారు కనిపించింది.

రెండు గంటలు ఆలస్యంగా...
ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభ వేదిక వద్దకు చేరుకున్నా రు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 11గంటలకు హాజ రుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.57 గంటలకు వచ్చారు. రెండు గంటలు ఆలస్యంగా హాజరైనప్పటికీ  పార్టీశ్రేణులు, ప్రజలు సీఎం రాక కోసం ఓపిగ్గా నిరీక్షించారు. సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు.

ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని చాటారు. సాంస్కృతిక కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్‌ బాపూరావు, రామారావు పటేల్, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ æరాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

పలువురి చేరిక..
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి పలువురు సీఎం స మక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జహీర్‌ రంజా నీ, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కలాల శ్రీని వాస్, మడావి మంగళ, మాజీ ఎంపీపీ ఆడే శీల, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌ రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. వారికి సీఎం కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.

ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు..
సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హెలిప్యాడ్‌ నుంచి సభ ప్రాంగణం వరకు దారి పొడవునా పోలీసులను మోహరించారు. సభా ప్రాంగణం వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకకు ముందు నుంచే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ గౌస్‌ ఆలం సీఎం వెనుదిరిగే వరకు అక్కడే ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు.

ఇవి చదవండి: ఒక్క రుణమాఫీపైనే ఒట్టా.. : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement