రక్షకులే.. భక్షకులా! | - | Sakshi
Sakshi News home page

రక్షకులే.. భక్షకులా!

Feb 3 2026 7:29 AM | Updated on Feb 3 2026 7:29 AM

రక్షకులే.. భక్షకులా!

రక్షకులే.. భక్షకులా!

చెట్లు నరకడంలో సిబ్బంది పాత్రపై అనుమానాలు ఇటీవల భూతాయి, చింతగూడలో భారీగా కలప పట్టివేత బాధ్యులపై మాత్రం చర్యలకు వెనుకంజ ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు

ఆదిలాబాద్‌టౌన్‌: కంచే చేను మేసిన చందంగా మారింది అటవీశాఖ తీరు. ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ఏటా అనేక కార్యక్రమాలు చేపడుతోంది.. లక్షల్లో మొక్కలు నాటుతోంది.. నిధులు సైతం భారీగా వెచ్చిస్తోంది. అయితే ఆ శాఖాధికారులు, ఉద్యోగుల ఉదాసీన వైఖరితో భారీ వృక్షాలు, చెట్లు స్మగ్లర్ల దాటికి నేలకొరుగుతున్నాయి. కలప అక్రమంగా తరలిపోతున్నా ‘మామూలు’గా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలే నిదర్శనం. చిన్న చిన్న కారణాలకే సిబ్బందికి మెమోలు జారీ చేయడం, సస్పెండ్‌ చేసే అధికారులు లక్షల విలువైన కలప పట్టుబడ్డా అందుకు బాధ్యులైన వారిపై చర్యలకు వెనుకాడడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..

గతనెల చివరి వారంలో గుడిహత్నూర్‌ మండలంలోని చింతగూడ, బజార్‌హత్నూర్‌ మండలంలోని భూతాయిలో అక్రమంగా నరికివేసిన లక్షల విలువైన కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. చింతగూడలో పంట చేలతో పాటు అడవిలో ఉన్న చెట్లను నరికి కొంత మంది ఇళ్లలో నిల్వ ఉంచారు. అయితే సిబ్బందికి ఇంట్లో కలప ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఒకరిద్దరిని పట్టుకొని ఇందుకు సంబంధించి రూ.2లక్షల వరకు జరిమానా చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. దీంతో కలపను దాచిపెట్టుకున్న వారు కొందరు తాము ఒక్కరే కాదని, గ్రామంలో చాలామంది ఉన్నారని తెలిపారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో అక్కడ జరిగిన తంతును వారు ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అధికారి వెంటనే స్పందించి ఎఫ్‌డీవోతో పాటు ఎఫ్‌ఆర్‌వోలు, సెక్షన్‌ ఆఫీసర్లు, బీట్‌ ఆఫీసర్లు అంతా పదుల సంఖ్యలో అక్కడికి వెళ్లారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 12 గంటల వరకు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. రెండు ట్రాక్టర్ల లోడ్‌ను పట్టుకున్నారు. మరుసటి రోజు ఓ ఎఫ్‌ఆర్‌తో పాటు మరికొంత మంది సిబ్బంది తనిఖీలు చేయగా, మరో ట్రాక్టర్‌ కలప లభించింది. తనిఖీలు నిర్వహిస్తే మరింత లభ్యమవుతుందని పలువురు చెబుతున్నారు. అయితే విషయాన్ని అటవీ శాఖాధికారులు బయట పెట్టకుండా దాచి ఉంచినట్లు సమాచారం. తర్వాత బజార్‌హత్నూర్‌ మండలంలోని భూతాయిలో సైతం ఓ కార్పెంటర్‌ వద్ద లక్షల విలువైన కలప పట్టుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి తొమ్మిది మందిపై కేసులు నమోదు చేయగా, నలుగురిని రిమాండ్‌ చేసినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌బీవోలతో పాటు ఆ రేంజ్‌కు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సిబ్బంది పాత్రపై అనుమానాలు..

ఈ అక్రమ కలప దందా వెనుక సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల జీతాలు తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లకుండా రోడ్డుపైనే తిరిగి అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడవిని కాపాడేందుకే ఎఫ్‌బీవోలు, సెక్షన్‌ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్లు, ఎఫ్‌ఆర్‌వోలు ఉన్నారు. అయితే వీరు కార్యాలయానికే పరిమితం కాగా, మరికొంత మంది ఎక్కడుంటున్నారనే విషయం కూడా తెలియడం లేదు. హెడ్‌క్వార్టర్‌లోనే ఉండాల్సిన సిబ్బంది అక్కడ ఉండకపోవడంతో కలప స్మగ్లింగ్‌ జరుగుతుందనే ఆరోపణలున్నాయి. వీరి ఫోన్‌కాల్స్‌ డిటేల్స్‌, బ్యాంక్‌ అకౌంట్స్‌ పరిశీలిస్తే ఈ తతంగం బయట పడుతుందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. కొంత మంది కార్పెంటర్లతో పాటు కలప స్మగ్లర్లతో సత్సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వీరికి ముట్టజెబితే విడిచిపెడుతున్నారని, చిన్నపాటి కలప పట్టుబడితే అమాయకులపై కేసులు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement