టైమ్‌సెన్స్‌ లేక నెలకు కోటి రూపాయల భారం!

Burden Of GHMC Electricity Bills Increase Maintenance Of Street Lights  - Sakshi

సాక్షి, కూకట్‌పల్లి: వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ బిల్లుల భారం అధికమవుతోంది. కాలానుగుణంగా వీధి దీపాల టైమర్లను మారుస్తూ ఉండాలి. కానీ అలా చేయకపోవడంతో వేసవిలో ఉదయం..సాయంత్రం వేళల్లో దాదాపు గంటన్నరపాటు అదనంగా వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఈ కారణంగా జీహెచ్‌ఎంసీ ఖజానాకు దాదాపు నెలకు రూ.కోటి రూపాయల భారం పడుతోంది. 

ఏం చేయాలంటే... 
ప్రతి రోజు 12 గంటల పాటు వీధి దీపాల కోసం టైమర్‌లను సెట్‌ చేసి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. అయితే..వేసవి కాలంలో 7 గంటలకు చీకటి పడుతుంది. ఉదయం పూట 5.30 గంటలకే తెల్లవారుతుంది. మామూలు రోజుల్లో సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లైట్లు వెలుగుతుంటాయి. కానీ వేసవిలో సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 వరకు మాత్రమే లైట్లు వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టైమర్లలో మార్పులు చేస్తే దాదాపు గంటన్నరపాటు విద్యుత్‌ ఆదా అవుతుంది.  

లెక్క ఇలా.. 
వీధి దీపాలపై మామూలుగా రోజుకు లక్ష రూపాయల వరకు ఒక్కో సర్కిల్‌కు బిల్లు వస్తుంది. 12 గంటలకు లక్ష రూపాయల బిల్లు వస్తే..గంటన్నరకు సుమారు రూ.12,500 అవుతుంది. ఈ విధంగా నెలకు సుమారు 3 లక్షల 75 వేల రూపాయలు ఒక్కో సర్కిల్‌లో విద్యుత్‌ బిల్లులను ఆదా చేసుకోవచ్చు.

ఈ విధంగా 30 సర్కిళ్లకు సుమారు కోటి రూపాయలకు పైగా అదనంగా బిల్లు వస్తోంది. వేసవి రెండు నెలలు టైమర్‌లను సెట్‌ చేస్తే కనీసం రూ.2 కోట్ల రూపాయలైనా జీహెచ్‌ఎంసీకి ఆదాయం మిగులుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 

(చదవండి: హరితహారం లక్ష్యం 19.5 కోట్ల మొక్కలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top