హరితహారం లక్ష్యం 19.5 కోట్ల మొక్కలు

Telangana: Chief Secretary Somesh Kumar Reviews Haritha Haram Dalit Bandhu - Sakshi

రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 7.7 శాతం పెరిగింది 

10 శాతం కన్నా తక్కువ అడవి ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ 

దళితబంధు యూనిట్లను వెంటనే గ్రౌండ్‌ చేయండి 

రైతు వేదికలను క్రియాశీలం చేయండి: జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 19.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది హరితహారాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల 7.70 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఎనిమిదో విడత హరితహారం కింద సాగునీటి ప్రాజెక్టుల వద్ద, కాల్వ గట్లపై పచ్చదనం పెంచడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వారంలోగా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

హరితహారం, దళితబంధు, యాసంగి వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 10 శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పెద్దఎత్తున పచ్చదనం పెంచాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,400 ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని, మిగిలిన గ్రామాల్లో వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.

ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్‌ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలని, పచ్చదనం పెంపునకు ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. దళితబంధు గురించి మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు చేసిన యూనిట్లకుగాను లబ్ధిదారులను గుర్తించాలని, ఇప్పటికే గుర్తించినవారికి వెంటనే లబ్ధి చేకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. 

ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కలి్పంచాలి 
ధాన్యం సేకరణ గురించి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూరాష్ట్రంలో ఏడు కోట్ల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.5 కోట్ల బ్యాగులు త్వరలో వస్తాయని చెప్పారు. అన్ని రైతు వేదికల్లో సమావేశాలు జరిగేలా చూడాలని, వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ డోబ్రియల్, పురపాలక శాఖ, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరి్వంద్‌కుమార్, రామకృష్ణారావు, రజత్‌కుమార్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top