సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్
సిట్ విచారణకు బరాబర్ పోతా
ఇదంతా అటెన్షన్ డైవర్షన్ గేమ్..
జిల్లాలను తొలగిస్తే ఉద్యమిస్తాం
సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: ఏ తప్పూ చేయలేదు.. దేనికీ భయపడమని..సిట్ విచారణకు బరాబర్ పోతానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని తెలంగాణభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వేసిన సిట్ అంటే.. రేవంత్‌రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని విమర్శించారు.
రేవంత్‌రెడ్డికి పరిపాలన రాదు..చేతగాదు, అసమర్థుడు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదన్నారు. హామీలు అమలు చేయకుండా అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పారు. ఈ రెండేళ్లు డ్రామాలు తప్ప రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాధించిందేమీ లేదని చెప్పారు. జిల్లాలను తగ్గించాలని చూస్తే బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకు..
మొన్న హరీశ్‌రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టారని సాయంత్రాని కల్లా సిట్ నోటీస్ ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. ఇటు రేవంత్‌రెడ్డి.. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బదులుకొని ఎలా దోపిడీ చేస్తున్నారో బయటపెడితేనే నోటీసులు పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడితే ఆశ్చర్యం అనిపించిందని చెప్పారు.
తాము ఆధారాలతో సహా చూపెడుతుంటే.. దొంగనే ఫిర్యాదు చేయాలనడం ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వ వైఖరి అట్లనే ఉందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెబితేనే జర్నలిస్టులు వార్తలు రాశారని.. వాటిపై ప్రభుత్వం ఖండించలేదని చెప్పారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీని అడుగుతున్నాను.. ప్రస్తుతం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదని ప్రమాణం చేసి చెప్పగలుగుతారా అని అన్నారు.
ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే కాపాడేందుకు నెహ్రూ టైం నుంచి ఇప్పటి మోదీ వరకు ఇది ఉంటుందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారని.. అది ఆయనకు తెలుసో తెలియదో తనకు తెలవదని కేటీఆర్ అన్నారు.
శాంతిభద్రతల వ్యవహారం
దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్‌గా చేసే కార్యక్రమమని కేటీఆర్ పేర్కొన్నారు. దానికి మంత్రులు, ప్రభుత్వంలో ఉండే నాయకులకు పాత్ర ఉండదని.. ఇదే చెబుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు గూఢచారి వ్యవస్థ మీద ఆధారపడతాయని, ప్రభుత్వాధినేతలకు రిపోర్టులు వస్తాయన్నారు. అవి ఎట్లా వస్తాయో తమకు తెలవదని పేర్కొన్నారు.
సిట్ ఎవరిని పిలవాలి?
నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన ప్రస్తుత డీజీపీగా ఉన్న శివధర్‌రెడ్డిని పిలిచారా? బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాల్టి డీజీపీ శివధర్‌రెడ్డి, మొన్నటి దాకా డీజీపీగా పనిచేసిన జితేందర్‌కు తెలుస్తది ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో, మాకేం తెలుస్తదని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
పది రోజుల టైం పాస్ వ్యవహారం
ముఖ్యమంత్రి దావోస్ పోయిండు కదా? ఆడికెళ్లి హార్వర్డ్ పోతుండు కదా? 10 రోజులు టైం పాస్ చేయాలి కదా? అందుకే ఒక రోజు హరీశ్‌రావును, ఒక రోజు కేటీఆర్‌ను పిలవండి.. అని సిట్‌కు ఆదేశాలిచ్చారని కేటీఆర్ అన్నారు. హరీశ్‌రావును పిలిచి అడిగిందే అడుగుడు, తిర్లమర్ల చేసి అడుగుడు, మరల తిర్లేసి అడుగుడు తప్ప.. ఈ ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే పనిచేసిందా అన్నారు.
దావోస్ పోయిన ముఖ్యమంత్రి ఎక్కడా ఉపముఖ్యమంత్రి తన కుర్చీ గుంజుకుంటాడోనని రేవంత్‌రెడ్డి నోటీసులు పేరిట టైంపాస్ డ్రామా చేయిస్తుండని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు.


