ద–పొలిటికల్‌–‘పుష్ప’! సినిమాలూ... రాజకీయ గుర్తులు... 

BRS Congress BJP Parties With Pushpa Movie Dialogues - Sakshi

సినిమాలంటే అందరికీ ఆసక్తి కదా. మామూలు జనాలకు మరీ ఎక్కువ. అందుకే జనాలందరికీ సినిమా భాషలోనే తమ అర్జీలు చెప్పుకుంటే పరమ క్యాచీగా ఉంటుందనుకున్నాయి రాజకీయ పార్టీలు. బాడీ లాంగ్వేజీలోలాగా... తమనే గెలిపించాలంటూ ‘మూవీ లాంగ్వేజీ’లో పొలిటికల్‌ పార్టీలు విన్నవించుకోవాలని నిర్ణయించుకుంటే... ఆ వచ్చే అభ్యర్థనలకు ఊహారూపమే ఈ   వాక్యాలు...  

‘పుష్ప సినిమా చూశారుగా అందరూ. అందులోని పాటలో హీరో చెప్పు జారిపోలా. అచ్చం అలాగే జారింది మా అధికారం కూడా. అయితే హీరోగారి గూడ పైకి లేచి నిలబడింది చూశారా... ఈసారి అచ్చం మీరూ మమ్మల్ని పైకి లేపండి. గూడను కాదు... మా చేతిని. అదే... చేతి గుర్తును.’’ 

‘ప్రజలారా... చేతిగుర్తు వారి మాటలు చెవిన పెట్టకండి. అసలు పుష్ప అంటే ఏమిటి? పువ్వు! దీని బట్టి తెలియడంల్యా.. ఎవరికి ఓటెయ్యాలో! పుష్పకు ఓటెయ్యండి. అంటే ‘పువ్వు గుర్తు’కు అని అర్థం. పువ్వు గుర్తు అంటే కమలం పార్టీ అని విజ్ఞులైన మీకు వేరే చెప్పాలా?’’ 

‘ఈ పువ్వు గుర్తువారూ, ఆ చెయ్యి గుర్తు వారూ ఎలాంటివాళ్లు? ఆ సినిమాలోనే చూశారుగా. గంధం చెక్కల ఆచూకీ చెప్పేదాకా కారెక్కించి తిప్పుతారు. తీరా ఆచూకీ దొరికాక... హీరో కారెక్కబోతుంటే కార్లోంచి కాలు పక్కకు లాగేస్తారు. నాల్రూపాయలు పారేసి... షేర్‌ ఆటోలో రమ్మంటారు. ఓడనెక్కేదాక ఓడమల్లయ్యా... ఓడ దిగాక బోడ మల్లయ్య. ఇలాంటి పార్టీలకా మీ ఓటు? పాపం... హీరో అప్పటికప్పుడు కారు కొనాల్సి వచ్చింది. హీరో కొన్నదేమిటి? ‘కారు’! ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. అసలు మా కారు గుర్తుకు ఓటేస్తే... కృతజ్ఞతకొద్దీ ఎప్పుడూ కార్లోనే తిప్పుతాం. కారు దిగకండి... మమ్మల్నీ దించకండి. కారు స్పీడు విషయంలో మీరు తగ్గేదేల్యా... మమ్మల్ని తగ్గించేదే ల్యా’’ సినిమా అభ్యర్థనలు పూర్తయ్యాయి.  

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ హెచ్చరించే కేన్సర్‌ క్యారెక్టర్‌ ‘ముఖేశ్‌’ఈసారి ఈ సినిమా యాడ్స్‌ అయ్యాక వచ్చాడు. అతడు చెప్పేదేమిటంటే...  
‘‘అసలా మూవీ హీరోయే ఓ ఎర్రచందనం స్మగ్లర్‌.  అతడు చేసేదే అడవుల్ని నరకడం.  మీకు అర్థమవ్వడం కోసం ఎంతటి సినిమా ఉపమాలిచ్చినా సరే...  ఈ నెగెటివ్‌ కేరెక్టర్ల పట్ల పాజిటివ్‌ కోణంలో కాకుండా  అసలు కేరెక్టర్లను గుర్తెరిగి ఎంచుకోండి.  ఐదేళ్ల పాటు హాయిగా మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top